రోహిత్‌ వారి సరసన చేరేనా?

15 Sep, 2018 11:48 IST|Sakshi

టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మన్‌, రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గైర్హాజర్‌.. ఫామ్‌లో లేని సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని.. నిలకడలేని బ్యాట్స్‌మెన్‌.. అనుభవం లేని యువ ఆటగాళ్లు.. టీమిండియా ఏ ఇతర జట్టుపై ఓడిపోయినా అభిమానులు తట్టుకుంటారు కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఓడితే మాత్రం జీర్ణించుకోలేరు. ఇన్ని ప్రతికూల సవాళ్ల మధ్య ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తున్నాడు. సెలక్టర్లు కోహ్లికి విశ్రాంతిని ఇచ్చినప్పుడల్లా రోహిత్‌ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇప్పటివరకు సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెడుతూ కెప్టెన్‌గా తనకు తాను నిరూపించుకున్నాడు. కానీ ఆసియా కప్‌లో అసలైన సవాలు రోహిత్‌ ముందుంది.

ఆటగాళ్లకు ‘పరీక్షా’సమయం
2019 ప్రపంచకప్‌ దృష్ట్యా సెలక్టర్లు ఆటగాళ్లను ఈ టోర్నీలో పరీక్షించనున్నారు. విరాట్‌ కోహ్లికి విశ్రాంతి నేపథ్యంలో మిడిల్‌ ఆర్డర్‌ బలాన్ని అంచనావేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అంబటి రాయుడు, కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే సామర్థ్యంపై ఒక అంచనాకు రానుంది. ఇక గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించిన కేదార్‌ జాదవ్‌, భువనేశ్వర్‌లు ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి. సీనియర్‌ ఆటగాడు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్న విషయమూ ఈ టోర్నీ ద్వారా స్పష్టమవుతుంది. కొత్త లెఫ్టార్మ్‌ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ టీమిండియాకు అదనపు బలమవుతాడా అనేది కూడా తేలనుంది. ఆటగాళ్లను పరీక్షిస్తునే తనకు తాను రోహిత్‌ శర్మ ప్రూవ్‌ చేసుకోవాలి. 

ఆసియా కప్‌లో టీమిండియాదే ఆదిపత్యం
ఆసియా కప్‌ను టీమిండియా ఆరు సార్లు ముద్దాడింది. కపిల్‌దేవ్‌, దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌, అజారుద్దీన్‌, ఎంఎస్‌ ధోనిలు ఆసియా కప్‌ను టీమిండియాకు అందించిన విజయవంతమైన సారథులు. అజారుద్దీన్‌, ఎంఎస్‌ ధోనిల నాయకత్వంలో రెండేసి సార్లు ఈ మెగా టోర్నీని భారత జట్టు గెలుచుకుంది. డిపెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న మరో సారి టైటిల్‌ నిలబెట్టుకుంటుందా? ఆసియా కప్‌ను అందించిన దిగ్గజ సారథుల సరసన రోహిత్‌ శర్మ చేరుతాడా? అంటూ ప్రస్తుతం క్రీడా విశ్లేషకులు, అభిమానులు చర్చించుకుంటున్నారు. 

కెప్టెన్‌గా విజయవంతం
రోహిత్‌ కెప్టెన్సీ సత్తా గురించి ఐపీఎల్‌లోనే అందరికీ అర్థమైంది. అందుకే సెలక్టర్లు కూడా ఈ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా మూడు వన్లేల్లో రెండు, తొమ్మిది టీ20ల్లో ఎనిమిది మ్యాచ్‌లు గెలుపొందింది. కీలక నిదహాస్‌ ట్రోఫీ కూడా ఈ ఓపెనర్‌ సారథ్యంలోనే టీమిండియా గెలుపొందింది. ఇక సారథ్య బాధ్యతల్లోనూ రోహిత్‌ బ్యాటింగ్‌లో చెలరేగుతున్నాడు. వన్డేల్లో మరోసారి డబుల్‌ సెంచరీ, టీ20లో టీమిండియా తరుపున ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించింది నాయకుడిగా ఉన్నప్పుడే.

   

మరిన్ని వార్తలు