చెన్నైకి షాక్‌.. అందుకే మేం గెలిచాం!

8 May, 2019 11:29 IST|Sakshi

కంచుకోటలో చెన్నైని ఓడించడంపై రోహిత్‌ కామెంట్‌

చెన్నై: ఎంఏ చిదంబరం స్టేడియం అలియాస్‌ చెపాక్‌ మైదానం.. ఏళ్లుగా చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు ఈ మైదానం పెట్టని కోటగా ఉంది. ఈ మైదానంలో 24 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 19 విజయాలను సొంతం చేసుకుంది. స్లోగా, మందకొడిగా ఉండే చెపాక్‌ మైదానాన్ని తన కంచుకోటగా మార్చుకున్న చెన్నై జట్టు.. ఇక్కడ ప్రత్యర్థులను వరుసగా మట్టికరిపిస్తూ వస్తోంది.

ఇక, తాజా ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ విషయంలో ఇది తలకిందులైందనే చెప్పాలి. ఐపీఎల్‌ చాంపియన్స్‌ డెన్‌ అయిన చెప్పాక్‌లో చెన్నైని ఓడించే మంత్రాన్ని ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. వరుసగా మూడుసార్లు చెన్నైని సొంత మైదానంలో ఓడించిన ముంబై ఇండియన్స్‌.. తాజాగా ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్‌ ఫైనల్‌కు వెళ్లడం ఆ జట్టుకు ఇది ఐదోసారి. గతంలో నాలుగుసార్లు ఫైనల్‌కు వెళ్లిన ముంబై మూడుసార్లు కప్‌ సొంతం చేసుకుంది.

తాజా ఐపీఎల్‌ క్వాలిఫైయర్‌-1లో కంచుకోటలో చెన్నైను ముంబై అలవోకగా మట్టికరిపించింది. మందకొడిగా ఉండే చెప్పాక్‌ పిచ్‌ను బాగా అర్థం చేసుకున్న ముంబై జట్టు తన స్పిన్‌ వనరులతో మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై జట్టును కుదేలు చేసింది. చెన్నైను 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 131 పరుగులకు మాత్రమే పరిమితం చేసిన ముంబై బౌలర్లు రాహుల్‌ చాహర్‌ (14 పరుగులకు 2 వికెట్లు, కృనాల్‌ (21 పరుగులకు 1 వికెట్‌), జయంత్‌ యాదవ్‌ (25 పరుగులకు ఒక వికెట్‌).. ధోనీలాంటి టాప్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సక్సెస్‌ అయ్యారు. 2010 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే.. ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో చెన్నైపై ముంబై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. మ్యాచ్‌ అనంతరం ఈ అంశంపై ముంబై సారథి రోహిత్‌ శర్మ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

చెన్నైను సొంతగడ్డ మీద ఓడించడంపై స్పందిస్తూ.. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఎదురుదాడి చేయగల బ్యాటింగ్‌ యూనిట్‌, వ్యూహాలు ఉండటమే చెప్పాక్‌లో తమ విజయానికి కారణమన్నారు. తమ జట్టు కూర్పు సమతూకంతో ఉందని, పరిస్థితులు ఎలా ఉన్నా దీటుగా ఆడగల నేర్పు ఉన్న ప్లేయర్లు జట్టులో ఉన్నారని, చెప్పాక్‌ మైదానంలోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం, ఆత్మవిశ్వాసంతో బ్యాట్స్‌మెన్‌ ఆడటమే చెన్నైలో తమ వరుస విజయాలకు కారణమని రోహిత్‌ తెలిపారు. ఇక్కడి పరిస్థితులను బాగా అర్థం చేసుకొని.. ఆకళింపు చేసుకొని బాగా ఆడగలిగామని రోహిత్‌ ఆనందం వ్యక్తం చేశారు. 54 బంతుల్లో 71 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్‌పై రోహిత్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ముంబై ఇండియన్స్‌ ఉత్తమ బ్యాట్స్‌మెన్‌లో సూర్యకూమార్‌ ఒకరని కొనియాడారు. తమ జట్టు ఫైనల్‌కు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని, ఫైనల్‌కు ఇంకా మూడురోజుల సమయం ఉండటంతో ఈ విరామాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకొని ఫైనల్‌కు సరికొత్తగా సన్నద్ధమవుతామని రోహిత్‌ వివరించారు.

మరిన్ని వార్తలు