క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

15 Jul, 2019 17:56 IST|Sakshi

ముంబై : ప్రపంచకప్‌ ఫైనల్‌ ఫలితంతో యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఐసీసీ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ఉన్న ఈ రూల్స్‌ను మార్చాల్సిందేనని పట్టుబడుతోంది. ఇప్పటికే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిపై తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా.. తాజా ప్రపంచకప్‌ ఫైనల్‌ ఫలితంతో సూపర్‌ ఓవర్‌ నిబంధన చర్చనీయాంశమైంది. న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌, సూపర్‌ ఓవర్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ నిబంధన ప్రకారం బౌండరీలు ఎక్కువ సాధించిన ఇంగ్లండ్‌ జట్టును విశ్వవిజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆఖరి బంతి వరకు ఇరు జట్లు సమాన పోరాట ప్రతిభను కనబర్చని స్థితిలో కేవలం బౌండరీలనే ప్రతిపాదికగా తీసుకొని విజేతగా ఎలా ప్రకటిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బౌండరీలకన్నా సింగిల్స్‌ తీస్తూ పరుగులు చేయడమే అసలైన క్రికెట్‌ అని, అలాంటిది ఎక్కువ బౌండరీలు చేసిన జట్టును ఎలా విజేతగా ప్రకటిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంయుక్త విజేతలుగా ప్రకటించే గత నిబంధనను మార్చి బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడం ఏ మాత్రం సరైంది కాదనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు మద్దతుగా టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మలు ట్వీట్‌ చేశారు. ఈ బౌండరీల నిబందన చెత్తదని గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా.. క్రికెట్‌లోని కొన్ని రూల్స్‌పై సీరియస్‌గా దృష్టిసారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు.

>
మరిన్ని వార్తలు