లంక అభిమానికి రోహిత్‌ శర్మ గిప్ట్‌

20 Mar, 2018 04:33 IST|Sakshi

కొలంబో : భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆదివారం జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఓ లంక అభిమానికి రోహిత్‌ అద్భుత బహుమతిని అందిచాడు. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఓ శ్రీలంక అభిమానికి వీఐపీ టిక్కెట్లు అందించాడు. అసలు ఏం జరిగిందంటే.. లంక పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రాక్టీస్‌ చేసుకొనే సమయంలో బంతులు వేసేందుకు కవీన్‌ ఫెర్నాండే అనే 23 ఏళ్ల ఆటగాడిని శ్రీలంక క్రికెట్‌ బోర్డు నియమించింది. ఒకసారి ప్రాక్టీస్‌ సెషన్‌లో కవీన్‌ వేసిన బంతులను రిషబ్‌ పంత్‌ ఎదుర్కొంటున్నాడు.

ఆ సమయంలో రిషబ్‌ పంత్‌ కొట్టిన ఓ బంతి అనుకోకుండా కవీన్‌ను బలంగా తాకడంతో ముక్కు, దవడ నుంచి రక్తం వచ్చింది. వెంటనే స్థానిక నవలోక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న కవీన్‌ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కవీన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లినట్లు విషయం తెలుసుకున్న రోహిత్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి, రెండు వీఐపీ టిక్కెట్లు తీసుకుని కవీన్‌కు పంపించాడు. ఆదివారం జరిగే ఫైనల్‌ను చూసేందుకు రావాలని కోరాడు. దీంతో కవీన్‌ ఆనందానికి అవధుల్లేవు. ఆదివారం తండ్రితో కలిసి వచ్చి కవీన్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ సందర్బంగా కవిన్‌ రోహిత్‌ శర్మను పొగడ్తలతో ముంచెత్తాడు.

మరిన్ని వార్తలు