‘బీ స్ట్రాంగ్‌ జడ్డూ.. నువ్వు చేయగలవు’

11 Jul, 2019 12:37 IST|Sakshi

ప్రపంచకప్‌ తొలి సెమీ ఫైనల్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలో దిగిన న్యూజిలాండ్‌ బౌలర్ల దాటికి టీమిండియా టాపార్డర్‌ టపాటపా కూలిన వేళ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సమయోచితంగా ఆడాడు. ధోనితో కలిసి అద్భుత ప్రదర్శనతో కోహ్లి సేనను దారుణ ఓటమి నుంచి తప్పించి గౌరవప్రదంగా నిష్క్రమించేందుకు బాటలు పరిచాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో ఓటమిలోనూ జడేజా త్రీడీ ఆట (77 పరుగులు, ఒక వికెట్, ఒక రనౌట్, రెండు క్యాచ్‌లు) కాస్త ఓదార్పునిచ్చే అంశం. కాగా కివీస్‌ బౌలర్లను ఎదుర్కొంటూ దూకుడు ప్రదర్శిస్తున్న క్రమంలో అభిమానులతో పాటు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ కూడా జడేజా ఉత్సాహపరిచాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజాకు డ్రెస్సింగ్‌ రూం నుంచే సలహాలు, సూచనలు చేశాడు. ఈ క్రమంలో బీ స్ట్రాంగ్‌ జడ్డూ. నువ్వు చేయగలవు అన్నట్లుగా సైగలు చేస్తున్న రోహిత్‌ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోను ట్యాగ్‌చేస్తూ... ‘ అందుకే రోహిత్‌ అంటే మాకు ఇష్టం. టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన కనబరిచిన హిట్‌మ్యాన్‌ సెమీస్‌లో వైఫల్యం చెందడం బాధించే అంశమే. కానీ ఇక్కడి దాకా చేరడంలో తన పాత్ర అమోఘం. ఇక జడేజా కూడా సరైన సమయంలో చెలరేగి ఆడాడు. కానీ లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయాడు. ఏదేమైనా నిరాశే మిగిలింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మెగాటోర్నీలో కళ్లు చెదిరే ఆటతో ఐదు సెంచరీలు చేసిన ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ సెమీస్‌లో కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్‌ చేరిన సంగతి తెలిసిందే. 

కాగా బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 30.3 ఓవర్లకు టీమిండియా స్కోరు 92/6 ఉన్న సమయంలో సాధించాల్సిన రన్‌రేట్‌ 8కి దగ్గరగా ఉంది. ఇలా చాలా ముందే ఓటమి ఖరారైన టీమిండియా చివరకు లక్ష్యానికి అంత దగ్గరగా వచ్చిందంటే అది జడేజా, ధోని ఘనతే. పాండ్యా ఔటయ్యేసరికి మన జట్టు గెలిచే అవకాశాలు 10 శాతమే. ఇలాంటి దశలో పొరపాటునైనా వికెట్‌ ఇవ్వకూడదన్నట్లు ధోని జాగ్రత్త పడ్డాడు. జడేజా మాత్రం వస్తూనే ధైర్యం చేసి నీషమ్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో సిక్స్‌ కొట్టి తాడోపేడో తేల్చుకోవాలన్నట్లు కనిపించాడు. ఇద్దరూ తమదైన సమన్వయంతో పరుగులు తీస్తూ స్కోరు బోర్డులో కదలిక తెచ్చారు. జట్టు స్కోరును 200 సైతం దాటించారు. అయితే గెలుపునకు 14 బంతుల్లో 32 పరుగులు అవసరమైన స్థితిలో బౌల్ట్‌ వేగం తగ్గించి వేసిన బంతికి జడేజా బోల్తా పడ్డాడు. అతడు కొట్టిన బంతి గాల్లో చాలా ఎత్తులో లేవగా లాంగాఫ్‌లో పొంచి ఉన్న విలియమ్సన్‌ ఒడిసి పట్టాడు. ఆ వెనువెంటనే ధోని, భువీ ఔటవడంతో కోహ్లి సేన కథ ముగిసింది.

>
మరిన్ని వార్తలు