కెప్టెన్‌గా ‘హిట్‌’ కొడతాడా!

29 Nov, 2017 00:06 IST|Sakshi

తొలిసారి భారత జట్టుకు నాయకత్వం వహించనున్న రోహిత్‌ శర్మ 

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఘనమైన రికార్డు  

భారత జట్టు తరఫున పదేళ్లలో 171 వన్డే మ్యాచ్‌లు... ఆరు వేలకు పైగా పరుగులు... కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌ జట్టుకు మూడు ఐపీఎల్‌ టైటిల్స్‌ అందించిన రికార్డు... అన్నింటికి మించి వన్డేల్లో రెండు ‘డబుల్‌ సెంచరీలు’ సాధించిన ఏకైక ఆటగాడిగా గుర్తింపు... రోహిత్‌ శర్మ అద్భుత కెరీర్‌లో ఇవన్నీ చెప్పుకోదగ్గ ఘనతలు. ఇప్పుడు మరో అరుదైన అవకాశం రోహిత్‌ను వెతుక్కుంటూ వచ్చింది. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో అతను తొలిసారి భారత జట్టు కెప్టెన్‌గా బరిలోకి దిగబోతున్నాడు. కోహ్లి గైర్హాజరీలో ఇది తాత్కాలికమేఅయినా... టీమిండియా కెప్టెన్సీ అనేది గొప్ప గౌరవం అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనకు లభించిన పరిమిత సమయంలో రోహిత్‌ నాయకుడిగా తన సత్తా చూపించగలడా, ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తాడా అనేది ఆసక్తికరం..!   

సాక్షి క్రీడా విభాగం : మహేంద్ర సింగ్‌ ధోని 2007లో పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత భారత జట్టు కెప్టెన్సీ విషయంలో మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది. అయితే వేర్వేరు కారణాలతో మధ్యలో ధోని విశ్రాంతి కోరుకున్న సమయంలో తాత్కాలికంగా కొందరికి అవకాశం దక్కింది. సురేశ్‌ రైనా (12 వన్డేలు), గౌతమ్‌ గంభీర్‌ (6), విరాట్‌ కోహ్లి (17), అజింక్య రహానే (3 వన్డేలు) మధ్యలో వివిధ సిరీస్‌లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఇదే కోవలో రోహిత్‌ శర్మ కూడా నాయకుడిగా మైదానంలో అడుగు పెడుతున్నాడు. అపార ప్రతిభ ఉన్నా దానికి తగిన న్యాయం చేయలేకపోయాడంటూ కెరీర్‌లో ఎక్కువ భాగం విమర్శలు ఎదుర్కొన్న రోహిత్, గత మూడేళ్లుగా తన అసలు సత్తాను ప్రదర్శిస్తూ బ్యాట్స్‌మన్‌గా తన స్థాయిని పెంచుకున్నాడు. జట్టులో సీనియర్‌ ఆటగాళ్ళలో ఒకడు కావడంతోపాటు టెస్టు వైస్‌ కెప్టెన్‌ రహానేకు వన్డే తుది జట్టులో చోటు ఖాయం కాకపోవడం వల్లే రోహిత్‌కు కెప్టెన్సీ అవకాశం దక్కిందనేది వాస్తవం. కోహ్లి శకంలో మున్ముందు ఇలాంటి చాన్స్‌ రావడం కష్టం కాబట్టి సొంతగడ్డపై రోహిత్‌ కెప్టెన్సీ నైపుణ్యానికి ఇది ఒక సవాల్‌ వంటిది.  

కోహ్లి ఆనాడే చెప్పాడు... 
ఆశ్చర్యకరంగా అనిపించినా నాలుగేళ్ల క్రితమే రోహిత్‌ శర్మ నాయకత్వ లక్షణాల గురించి విరాట్‌ కోహ్లి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘రోహిత్‌కు అపరిమితమైన క్రికెట్‌ పరిజ్ఞానం ఉంది. మ్యాచ్‌లలో తరచుగా నేను అతడి నుంచి సలహాలు తీసుకుంటాను. భారత కెప్టెన్‌ కాగల సత్తా రోహిత్‌లో ఉంది’ అంటూ 2013 ఆగస్టులోనే కోహ్లి వ్యాఖ్యలు చేశాడు. అంతకు కొద్ది రోజుల క్రితమే చాంపియన్స్‌ ట్రోఫీలో ఓపెనర్‌గా రావడంతో రోహిత్‌ కెరీర్‌ మలుపు తిరిగింది. అయితే కారణాలేమైనా జూనియర్‌ అయిన కోహ్లి దూసుకుపోవడం, కెప్టెన్‌గా కూడా తనదైన మార్క్‌ చూపించడం చకచకా జరిగిపోగా, రోహిత్‌కు మాత్రం కెప్టెన్సీ అవకాశం దక్కలేదు. అతని కెరీర్‌ను చిన్నప్పటి నుంచి చూసిన ముంబై మాజీ క్రికెటర్ల అభిప్రాయంలో ‘సోమరిపోతు’ అనే ముద్ర రోహిత్‌ను భారత జట్టు నాయకత్వానికి దూరం చేసింది. తనదైన రోజున అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయి రికార్డుల వరద పారించే రోహిత్‌ బాడీ లాంగ్వేజ్‌ మాత్రం ఏదో కోల్పోయినట్లుగా, నిరుత్సాహంగా కనిపిస్తుంది. అతని జట్టు సహచరులు కూడా ఈ విషయాన్ని అనేక సార్లు బహిరంగంగానే చెప్పారు. ఇటీవల శ్రీలంక గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లలో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు కూడా అతనిలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక ఇప్పుడు రోహిత్‌ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా మాత్రమే కాకుండా, నాయకుడిగా అదనపు బాధ్యత తీసుకోవాల్సిన సమయంలో ఇలాంటివి కుదరవు. బ్యాట్స్‌మన్‌గా ఈ ఏడాది 18 వన్డేల్లోనే 5 సెంచరీలు సహా 1,076 పరుగులు చేయడం అతనికి కెప్టెన్‌గా అదనపు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.  

ఐపీఎల్‌తో భిన్నం... 
భారత కెప్టెన్సీ విషయంలో కోహ్లి, రోహిత్‌లలో ఎవరు గొప్ప అనే చర్చ గతంలో పలు మార్లు వచ్చింది. అయితే ఇలాంటి సందర్భాల్లో ఏ వైపు నుంచి కూడా రోహిత్‌కు పెద్దగా మద్దతు లభించలేదు. దూకుడులో, బాధ్యత తీసుకొని నడిపించడంలో అతను కోహ్లితో పోలికలో సమఉజ్జీ కాలేకపోయాడు. నిజానికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కోహ్లితో పోలిస్తే రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 2013, 2015, 2017లలో అతను ముంబై ఇండియన్స్‌ జట్టును విజేతగా నిలిపాడు. మరోసారి ఆ జట్టు చాంపియన్స్‌ లీగ్‌ కూడా గెలుచుకుంది. ముఖ్యంగా పుణేతో ఉత్కంఠభరితంగా సాగిన పదో సీజన్‌ ఫైనల్లో రోహిత్‌ కెప్టెన్సీపై ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే చాలా మంది దృష్టిలో ఈ మూడు టైటిల్స్‌ రోహిత్‌ ఘనత మాత్రమే కాదు. ప్రపంచంలోనే బలమైన సహాయక సిబ్బంది ముంబై టీమ్‌ వెంట ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చిందనేది వారి అభిప్రాయం. పైగా టి20 ఫార్మాట్‌లో, అందులోనూ ఒక ఫ్రాంచైజీ టోర్నీలో వ్యూహ ప్రతివ్యూహాలు, కెప్టెన్‌ బాధ్యతల పాత్ర తక్కువ. అయితే దేశం తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడి, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌–10లో ఉన్న రోహిత్‌ అనుభవం తక్కువేమీ కాదు. ఒక జట్టుకు నాయకత్వం వహించేందుకు అది చాలా ఎక్కువ. ఇది కచ్చితంగా రోహిత్‌ను అనుకూలించే అంశం. అన్నింటికి మించి తన కెరీర్‌ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ధోని మైదానంలో ఎలాగూ అండగా ఉండనే ఉన్నాడు. కాబట్టి లంకలాంటి బలహీన జట్టుతో జరిగే సిరీస్‌లో కెప్టెన్‌గా అతనికి అంతా అనుకూల వాతావరణమే ఉంది.

24  వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న 24వ ఆటగాడు రోహిత్‌. ముంబై తరఫున 7వ క్రికెటర్‌. 

మరిన్ని వార్తలు