ధోని రికార్డును రోహిత్‌ దాటేస్తాడా?

27 Jun, 2019 13:05 IST|Sakshi

మాంచెస్టర్‌: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డు ముంగిట నిలిచాడు. మరో 2 సిక్సర్లు బాదితే ధోని రికార్డును అధిగమిస్తాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. 210 వన్డేలు ఆడిన రోహిత్‌ ఇప్పటివరకు 224 సిక్సర్లు బాదాడు. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఖాతాలో 225 సిక్సర్లు ఉన్నాయి. పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది(351 సిక్సర్లు), వెస్టిండీస్‌ హిట్టర్‌ క్రిస్‌గేల్‌(324 సిక్సర్లు) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్‌ సనత్ జయసూర్య 270 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 250 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో టాప్‌-5లో నిలిచిన ఒకే ఒక్కడు రోహిత్‌ కావడం విశేషం.

టెస్ట్‌, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లను కలిపి చూస్తే ధోని కంటే రోహిత్‌ శర్మ కొట్టిన సిక్సర్లు ఎక్కువగా ఉన్నాయి. 358 సిక్సర్లతో రోహిత్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ధోని 355 సిక్సర్లు కొట్టాడు. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. రెండు సెంచరీలు, అర్ధశతకంతో 320 పరుగులు సాధించాడు. ఈరోజు వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో రాణించి తన రికార్డులను మరింత మెరుగుపరుచుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు