వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ సాధిస్తా! : రో'హిట్'

1 Dec, 2017 22:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శ్రీలంకతో ఇక్కడి ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో చివరిదైన మూడో టెస్ట్ శనివారం ప్రారంభం కానుంది. అయితే భారత క్రికెట్ అభిమానులు మాత్రం వన్డే సిరీస్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ఓపెనర్ రోహిత్ శర్మ, అతడి ఆటతీరు. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్  కోహ్లీకి లంకతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా, తాత్కాలికంగా రోహిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చారు. వన్డేల్లో రెండుసార్లు డబుల్ సెంచరీలు చేసిన రోహిత్‌ను మీకు ఏ డబుల్ సెంచరీ ఇష్టమంటే మాత్రం.. సమాధానం చెప్పడం కష్టమంటాడు.

దీనిపై రోహిత్ శర్మ మాట్లాడాడు. 'వన్డేల్లో నేను బ్యాటింగ్‌కు దిగుతున్నానంటే 300 కొట్టే మ్యాచ్ ఈరోజు అవుతుందా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య ఎక్కడ కనిపించినా మీరు వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ ఎప్పుడు కొడతారంటూ ఒక్కటే ప్రశ్న. వన్డే మ్యాచ్‌లో 300 పరుగులంటే అంత సులువనుకుంటారేమో. ఐనా ఆ అరుదైన ఫీట్ కోసం శాయశక్తులా కృషిచేస్తాను. 2014లో నవంబర్ 13న లంకపై 264 పరుగులు చేసి ఔటయ్యాను. అప్పటి మా కోచ్ డంకన్ ప్లెచర్ మాత్రం నేను ఈజీగా ట్రిపుల్ సెంచరీ చేస్తానని భావించారట. నేను ఔటయ్యాక నాతో ఆ విషయాన్ని చెప్పడం నాకింకా గుర్తేనని ' క్రికెటర్ రోహిత్ వివరించాడు.

గతంలో మాములు ఆటగాడిగా 264 పరుగులు చేసిన రోహిత్, ఈ సిరీస్‌లో కెప్టెన్ హోదాలో వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేసి ఆ అరుదైన ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా ఈ భారత ఓపెనర్ అవతరించాలని దేశ క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు