రో'హిట్'@ 267

2 Nov, 2017 15:33 IST|Sakshi

న్యూఢిల్లీ:టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన బ్యాటింగ్ టాలెంట్ ను మరోసారి నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్ తో బుధవారం ఇక్కడ జరిగిన తొలి టీ 20లో రోహిత్ శర్మ 55 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్. ఓవరాల్ టీ 20 ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్లలో రోహిత్ తొలి స్థానాన్ని ఆక్రమించాడు. నిన్నటి మ్యాచ్ లో నాలుగు సిక్సర్లు సాధించడం ద్వారా 267వ టీ 20 సిక్సర్ రోహిత్ ఖాతాలో చేరింది. తద్వారా భారత తరపున ఇప్పటివరకూ సురేశ్ రైనా పేరిట ఉన్న అత్యధిక టీ 20 సిక్సర్ల రికార్డును రోహిత్ సవరించాడు. టీ 20 ఫార్మాట్ లో రైనా 265 సిక్సర్లు సాధించగా దాన్ని రోహిత్ బద్ధలు కొట్టాడు. ఇక్కడ యువరాజ్ సింగ్ 244 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా, ఎంఎస్ ధోని 226 సిక్సర్లతో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 214 సిక్సర్లతో ఆరో స్థానంలో ఉండగా, యూసఫ్ పఠాన్ 221 సిక్పర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ ఓవరాల్ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు. టీ 20ల్లో 309 మ్యాచ్ లాడిన గేల్ 772 సిక్సర్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

ఇదిలా ఉంచితే, టీ 20ల్లో భారత్ విజయం సాధించిన మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో భారత్ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. 41 మ్యాచ్ ల్లో పది అర్థశతకాలతో 1010 పరుగులు సాధించి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక్కడ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లి 34 మ్యాచ్ ల్లో 69.57 సగటుతో 1322 పరుగులతో ఉన్నాడు. ఇటీవల కివీస్ తో జరిగిన మూడో వన్డే అనంతరం ఈ ఫార్మాట్ లో 150 సిక్సర్లను అత్యంత తక్కువ ఇన్నింగ్స్ ల్లో సాధించిన తొలి భారత క్రికెటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 171 మ్యాచ్ ల్లో 165 ఇన్నింగ్స్ ల్లో రోహిత్ 150వ వన్డే సిక్సర్ ను సాధించాడు. ఇది భారత తరపున వేగవంతమైన మైలురాయిగా రికార్డు పుస్తకాల్లో చేరింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా