రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ..

2 Apr, 2020 16:48 IST|Sakshi
రోహిత్‌ శర్మ(ఫైల్‌ఫొటో)

ఇంట్లో ఉన్నాం.. హిందీలోనే మాట్లాడతాం

ముంబై: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు చిర్రెత్తుకొచ్చింది. కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో లాక్‌డౌన్‌ పాటిస్తున్న భారత క్రికెటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే  బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి చాట్‌ చేశాడు. వీరిద్దరి చాట్‌లో భాగంగా రోహిత్‌ను ఒక అభిమాని ఒక ప్రశ్న అడిగాడు. ‘ మీరిద్దరూ హిందీలో ఎందుకు మాట్లాడుతున్నారు.. ఇంగ్లిష్‌లో మాట్లాడవచ్చు కదా’ అని సదరు అభిమాని అడిగాడు. దాంతో రోహిత్‌కు కోపం కట్టెలు తెంచుకుంది. (రెండేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన గంభీర్‌)

అంతే వేగంగా ఆ అభిమానికి ఘాటుగా రిప్లై ఇచ్చాడు రోహిత్‌. ‘ మేము భారతీయులం. హిందీలోనే మాట్లాడతాం. టీవీ ఇంటర్యూల్లో ఇంగ్లిష్‌లో మాట్లాడతా. నేను ప్రస్తుతం ఇంటి వద్దనే ఉన్నా’ అంటూ అసహనంగా బదులిచ్చాడు. దీనిపై బుమ్రా స్పందిస్తూ.. ఫ్యాన్స్‌తో ఏది చేసినా సమస్యగానే ఉందన్నాడు. ఇంగ్లిష్‌లో మాట్లాడితే హిందీలో మాట్లాడమంటారు.. అదే హిందీలో మాట్లాడితే ఇంగ్లిష్‌లో మాట్లాడమంటారు’ అని రోహిత్‌కు బుమ్రా మద్దతుగా నిలిచాడు. 

వీరిద్దరూ ప్రధానంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌ గురించే లైవ్‌ చాట్‌లో మాట్లాడారు. ఐపీఎల్‌ జరుగుతుందా.. లేదా అనే విషయాన్ని ప్రస్తావించకుండానే, మన సన్నాహాలు ఎలా ఉండాలనే అంశాలపై చర్చించారు. ట్రెంట్‌ బౌల్ట్‌తో కలిసి బౌలింగ్‌ ఎన్‌కౌంటర్‌ ఎలా ఉండబోతుందనే విషయం వీరి సంభాషణలో ప్రస్తావనకు వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో బౌల్ట్‌ను ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.(‘ట్రంప్‌లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’)

మరిన్ని వార్తలు