బ్యాడ్‌ లైట్‌తో ఆట రద్దు!

19 Oct, 2019 16:07 IST|Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి రోజు ఆటలో మరింత ఆధిక్యాన్ని సాధించాలనుకున్న టీమిండియాకు నిరాశే ఎదురైంది. బ్యాడ్‌ లైట్‌ కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇక మ్యాచ్‌ తిరిగి కొనసాగించేందుకు వాతావరణం అనుకూలించే అవకాశం లేకపోవడంతో ఈరోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ రోజు కేవలం 58 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇంకా దాదాపు 32 ఓవర్లు ఆడాల్సి ఉన్నప్పటికీ బ్యాడ్‌ లైట్‌ అడ్డుకుంది. టీ విరామానికి వెళ్లిన వచ్చిన కాసేపటికి మ్యాచ్‌కు బ్యాడ్‌ లైట్‌ అంతరాయం ఏర్పడింది. ఆపై వర్షం కూడా పడటంతో తొలి రోజు మిగిలి ఉన్న ఆటను రద్దు చేశారు.తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(117 బ్యాటింగ్‌; 164 బంతుల్లో 14 ఫోర్లు, 4సిక్సర్లు), రహానే(83 బ్యాటింగ్‌; 135 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌)లు క్రీజ్‌లో ఉన్నారు.  వీరిద్దరూ అజేయంగా 185 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.

శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మయాంక్‌ అగర్వాల్‌(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరితే, కాసేపటికి చతేశ్వర పుజారా డకౌట్‌ అయ్యాడు. 9 బంతులు ఆడిన పుజారా తన పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. కాగా, అటు తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి రెండు ఫోర్లతో ఊపు మీద కనిపించాడు. కాకపోతే దక్షిణాఫ్రికా పేసర్‌ నార్జీ వేసిన బంతికి కోహ్లి వికెట్లు ముందు దొరికిపోయాడు. ఆ తరుణంలో రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌.. ఆ తర్వాత వేగం పెంచాడు. వన్డే తరహాలో బౌండరీల మోత మోగించాడు. మరొకవైపు రహానే కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. రహానే నుంచి చక్కటి సహకారం లభించడంతో రోహిత్‌ రెచ్చిపోయి ఆడాడు. దాంతో త్వరగా సెంచరీ మార్కును చేరాడు. ఆ తర్వాత రహానే కూడా మెల్లగా శతకానికి దగ్గరయ్యాడు. ఈ తరుణంలో మ్యాచ్‌ నిలిచిపోయింది.

 

మరిన్ని వార్తలు