రోహిత్‌ మళ్లీ మెరిశాడు..

19 Oct, 2019 13:02 IST|Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో వరుస సెంచరీలు సాధించిన టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా మెరిశాడు. చివరిదైన మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. టీమిండియా కీలక వికెట్లు చేజార్చుకున్న సమయంలో రోహిత్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకంతో ఆదుకున్నాడు. రోహిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించే క‍్రమంలో 8 ఫోర్లు, 1 సిక్సర్‌ కొట్టాడు. శనివారం ఆరంభమైన మూడో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే మయాంక్‌ అగర్వాల్‌(10), చతేశ్వర్‌ పుజారా(0), కోహ్లి(12)లు త్వరగా పెవిలియన్‌ చేరారు. ఆ తరుణంలో రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ చక‍్కదిద్దే బాధ్యతను రోహిత్‌ భుజాలపై వేసుకున్నాడు. ఆచితూచి ఆడుతూనే అవసరమైన సందర్భాల్లో బ్యాట్‌ ఝుళిపిస్తూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాసేపటికి అజింక్యా రహానే కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. 70 బంతుల్లో 8 ఫోర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.

మూడో టెస్టులో టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఈ రోజు మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపట్లోనే భారత్‌ రెండు వికెట్లను చేజార్చుకుంది. టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరితే, రెండో వికెట్‌గా చతేశ్వర్‌ పుజారా ఔటయ్యాడు. దాంతో  భారత్‌ జట్టు 16 పరుగులకు రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా రబడా వేసిన ఐదో ఓవర్‌ ఆఖరి బంతికి అగర్వాల్‌ ఔటయ్యాడు. రబడా కాస్త స్వింగ్‌ అయ్యేలా వేసిన బంతిని నిర్లక్ష్యంగా ఆడిన మయాంక్‌ థర్డ్‌ స్లిప్‌లో ఉన్న ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాత ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన పుజారా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. రబడా వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతికి తృటిలో ఎల్బీడబ్యూ అయ్యే అవకాశం తప్పించుకున్న పుజారా.. తొమ్మిదో ఓవర్‌ మూడో బంతికి ఎల్బీగానే ఔటయ్యాడు.  ఈ రెండు వికెట్లను రబడా సాధించి దక్షిణాఫ్రికా బ్రేక్‌ ఇచ్చాడు. కాసేటికి కోహ్లి కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. నార్జే బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు.

మరిన్ని వార్తలు