సిక్సర్ల మొనగాళ్లు వీరే.!

25 Dec, 2017 13:03 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : క్రికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన ఈ రోజుల్లో బ్యాట్స్‌మెన్‌ సిక్సులు కొట్టడంలో పోటీపడుతున్నారు. ఇక టీ20లు, చిన్న మైదానంలు అందుబాటులోకి రావడంతో అలవోకగా బంతిని బౌండరీ దాటించేస్తున్నారు. మొన్నటికి మొన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిక్సుల వర్షంతో వేగవంతమైన సెంచరీ సాధించిన టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఈ ఏడు అన్ని ఫార్మట్లలో కలిపి అత్యధిక సిక్సుర్లు బాదిన రికార్డు నమోదు చేశాడు.

రోహిత్‌ ఏకంగా ఈ ఏడు 65 సిక్సులతో ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఇక అంతకు ముందు ఒక క్యాలండర్‌ సంవత్సరంలో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉండగా రోహిత్‌ శర్మ అధిగమించాడు. మిస్టర్‌ 360 అని ముద్దుగా పిలుచుకునే డివిలియర్స్‌ 2015లో 63 సిక్సులు బాదాడు. ఒక క్యాలెండర్‌ ఏడాదిలో అత్యధిక సిక్సులు కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌గా సచిన్‌(58) 1998లో ఉన్న రికార్డును 19 ఏళ్ల తర్వాత రోహిత్‌ అధగమించడం విశేషం. 

టీ20ల సింహాం వెస్టిండీస్‌ ప్లేయర్‌ క్రిస్‌గేల్‌ 2012లో మూడు ఫార్మట్లలో కలిపి 59 సిక్సులు బాదాడు. ఇక కెరీర్‌ మొత్తంలో 454 సిక్సులతో అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2011లో ఆస్ట్రేలియా ఆటగాడు షేన్‌ వాట్సన్‌ 57 సిక్సులు కొట్టాడు.

2015లో  పాకిస్థాన్‌ ఆటగాడు షాహిదీ ఆఫ్రిదీ 56 సిక్సలు బాదాడు. వన్డేల్లో 37 బంతుల్లోనే సెంచరీ సాధించి బూమ్‌ బూమ్‌ ఆఫ్రిదీగా గుర్తింపు పొందిన ఈ ఆటగాడు కెరీర్‌ మొత్తలో 476 సిక్సులు కొట్టి తొలి స్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు