వెనిజులా పసిడి బోణీ

9 Aug, 2017 00:29 IST|Sakshi
వెనిజులా పసిడి బోణీ

ట్రిపుల్‌ జంప్‌లో రోజస్‌కు స్వర్ణం

లండన్‌: మూడున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ... ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి  వెనిజులా ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మహిళల ట్రిపుల్‌ జంప్‌ ఈవెంట్‌లో వెనిజులా క్రీడాకారిణి యులీమార్‌ రోజస్‌ పసిడి పతకాన్ని దక్కించుకొని కొత్త చరిత్ర సృష్టించింది. రోజస్‌ 14.91 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచింది. కాటరీన్‌ ఇబార్‌గుయెన్‌ (కొలంబియా–14.89 మీటర్లు) రజతం, ఓల్గా రిపకోవా (కజకిస్తాన్‌–14.77 మీటర్లు) కాంస్యం గెల్చుకున్నారు.

అమెరికాకు షాక్‌...: పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో ఒమర్‌ మెక్లాయిడ్‌ 13.04 సెకన్లలో రేసును పూర్తి చేసి ఈ మెగా ఈవెంట్‌లో జమైకాకు తొలి స్వర్ణం అందించగా... ప్రతీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ విభాగంలో కనీసం కాంస్యమైనా గెలుస్తూ వచ్చిన అమెరికాకు ఈసారి ఎలాంటి పతకం రాకపోవడం గమనార్హం. మహిళల 1500 మీటర్ల విభాగంలో ఫెయిత్‌ కిపియోగాన్‌ (కెన్యా–4ని:02.59 సెకన్లు) స్వర్ణం సాధించింది. జెన్నిఫర్‌ సింప్సన్‌ (అమెరికా), కాస్టర్‌ సెమెన్యా (దక్షిణాఫ్రికా) కాంస్యం నెగ్గింది. మహిళల హ్యామర్‌ త్రో విభాగంలో అనీటా వ్లోదార్‌జిక్‌ (పోలాండ్‌–77.90 మీటర్లు) పసిడి పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల సెమీఫైనల్లో భారత క్రీడాకారిణి నిర్మలా షెరోన్‌ 53.07 సెకన్లలో గమ్యానికి చేరి ఏడో స్థానంతో సరిపెట్టుకొని ఫైనల్‌కు చేరలేకపోయింది.

అథ్లెట్స్‌కు అస్వస్థత: కలుషిత ఆహారం కారణంగా పురుషుల 400 మీటర్ల ఫైనల్లో బరిలోకి దిగాల్సిన బోట్స్‌వానా స్టార్‌ అథ్లెట్‌ ఐజాక్‌ మక్‌వాలా వైదొలిగాడు. మక్‌వాలాతోపాటు మరో 30 మంది అథ్లెట్లు తాము బసచేసిన హోటల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు లోనయ్యారని నిర్వాహకులు తెలిపారు. 

మరిన్ని వార్తలు