తండ్రిని తలచుకుని ఏడ్చేసిన రొనాల్డో

16 Sep, 2019 16:56 IST|Sakshi

లిస్బన్‌: పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఘనత క్రిస్టియోనో రొనాల్డోది. పోర్చుగల్‌కు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతతో పాటు ఆ జట్టు తరఫున అత్యధిక గోల్స్‌ సాధించిన రికార్డును కూడా తన పేరిటే లిఖించుకున్న రొనాల్డో ఒక ఇంటర్యూలో వెక్కి వెక్కి ఏడ్చేశాడు. తాను సాధించిన ఘనతలను కుటుంబంలో అంతా చూసినా, తన తండ్రి మాత్రం చూడలేకపోయాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల ఇంగ్లిష్‌ జర్నలిస్టు పీయర్స్‌ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు రొనాల్డో. తన తండ్రి ఎంతో భావోద్వేగానికి గురై నటించిన వీడియోను కొన్ని రోజుల క్రితమే చూశానని,  అందులో కొడుకు గురించి ఎంతో గొప్పగా చెబుతున్న విషయం తనను ఎంతో ఉద్వేగానికి గురి చేసిందన్నాడు.

‘నేను అంతకుముందు ఎప్పుడూ ఆ వీడియోను చూడలేదు.  అది నమ్మశక్యంగా లేదు’ అని రొనాల్డ్‌ అంటూ తన దుఃఖాన్ని ఆపుకోలేపోయాడు. అందులో అంతగా ఏడిపించే సన్నివేశం ఏముందని మోర్గాన్‌ అడగ్గా.. ‘నేను నంబర్‌ వన్‌ కావడం దగ్గర్నుంచి, నేను తీసుకున్న అవార్డులు ఏవీ నాన్న జోస్‌ డినిస్‌ చూడలేదు.  ఏ ఒక్క ఘనతను చూడలేకపోయాడు. నేను ఫుట్‌బాల్‌ రంగంలో ఎలా ఎదిగానో అస్సలు మా నాన్నకు తెలీదు. మా కుటుంబం అంతా నా ఘనతల్ని చూశారు. మా అమ్మ, సోదరులు,  ఆఖరికి నా కొడుకు కూడా నేను అవార్డులు తీసుకోవడం చూశాడు. కానీ నాన్న మాత్రం అందుకు నోచుకోలేదు. బాగా యుక్త వయసులోనే నాన్న చనిపోయారు’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రొనాల్డో. ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్‌ డి ఓర్‌’ అవార్డును రొనాల్డో ఐదు సార్లు అందుకున్నాడు. 2008, 2013, 2014, 2016, 2017ల్లో ఈ అవార్డును రొనాల్డో అందుకున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా