లూక్ రోంచీ మెరుపులు

24 Jan, 2015 00:57 IST|Sakshi
లూక్ రోంచీ మెరుపులు

డ్యునెడిన్: సరిగ్గా 20 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోరు 93/5. ఈ దశలో ఎవరైనా ఆ జట్టు 200 పరుగులు చేస్తే గొప్పే అనుకోవడం సహజం. కానీ ఏడో నంబర్ బ్యాట్స్‌మన్ లూక్ రోంచీ (99 బంతుల్లో 170 నాటౌట్; 14 ఫోర్లు; 9 సిక్సర్లు) అసాధారణ ఆటతీరును ప్రదర్శించాడు. తనకు గ్రాంట్ ఇలియట్ (96 బంతుల్లో 104 నాటౌట్; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) చక్కటి సహకారం అందించడంతో కివీస్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్లకు ఏకంగా 360 పరుగులు సాధించి ఔరా అనిపించింది.

ఈ క్రమంలో వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 267 పరుగులు జత చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.ఫలితంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో కివీస్ 108 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. ఏడు వన్డేల ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టు 3-1తో ఆధిక్యంలో ఉంది. 42.3 ఓవర్ల వద్ద కెరీర్లో తొలి సెంచరీ సాధించిన రోంచీ... లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ చివరి 45 బంతుల్లో 70 పరుగులు చేశాడు.

అలాగే వన్డేల్లో ఏడో నంబర్ బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కివీస్ వికెట్ కీపర్‌గానూ రోంచీ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డు నెలకొల్పాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 43.4 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ దిల్షాన్ (116; 17 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీ చేయగా... తిరిమన్నె (65 బంతుల్లో 45; 3 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. కేవలం 41 పరుగులకే చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయిన లంక దారుణ పరాజయం పాలైంది. బౌల్ట్‌కు నాలుగు వికెట్లు, సౌతీ, మెక్లింగన్, ఇలియట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

మరిన్ని వార్తలు