భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్‌

3 Aug, 2019 05:56 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో 267/4

రోరీ బర్న్స్‌ అజేయ సెంచరీ

బర్మింగ్‌హామ్‌: యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టు తొలి టెస్టులో పైచేయి సాధించేందుకు పరుగుల బాట పట్టింది. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (282 బంతుల్లో 125 బ్యాటింగ్‌; 16 ఫోర్లు) అజేయ శతకం సాధించగా, కెప్టెన్‌ జో రూట్‌ (119 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో ప్యాటిన్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆట నిలిచే సమయానికి బర్న్స్‌తో పాటు స్టోక్స్‌ (71 బంతుల్లో 38 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.  

రాయ్‌ విఫలమైనా...
రెండో రోజు ఆరంభంలోనే ఇంగ్లండ్‌కు రాయ్‌ రూపంలో తొలి దెబ్బ తగిలింది. 10/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ కాసేపటికే ఓపెనర్‌ రాయ్‌ (10)ను కోల్పోయింది. ప్యాటిన్సన్‌ బౌన్సర్‌ను ఆడిన రాయ్‌ రెండో స్లిప్‌లో ఉన్న స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత ఓపెనర్‌ బర్న్స్‌కు కెప్టెన్‌ రూట్‌ జతయ్యాడు. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది.

రూట్‌ అర్ధసెంచరీ
రెండో సెషన్‌ పూర్తిగా ఇంగ్లండ్‌ వశమైంది. బర్న్స్, రూట్‌ కుదురుగా ఆడటంతో కంగారూ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఓపెనర్‌ బర్న్స్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటి తర్వాత ఇంగ్లండ్‌ 39వ ఓవర్లో 100 పరుగులు దాటింది. రూట్‌ అడపాదడపా బౌండరీలు బాదడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోయింది. డ్రింక్స్‌ తర్వాత రూట్‌ 110 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కాసేపటికి సిడిల్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి రూట్‌  నిష్క్రమిం చాడు. దీంతో 132 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

శతక్కొట్టిన బర్న్స్‌
రూట్‌ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన డెన్లీ (18; 3 ఫోర్లు), తర్వాత వచ్చిన బట్లర్‌ (5)స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో ఇంగ్లండ్‌ 194 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత స్టోక్స్‌ అండతో బర్న్స్‌ 224 బంతుల్లో టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. వీళ్లిద్దరు పట్టుదలతో ఆడటంతో ఇంగ్లండ్‌ మరో వికెట్‌ కోల్పోకుండా రెండో రోజును ముగించింది. కమిన్స్, సిడిల్‌ చెరో వికెట్‌ తీశారు.  

మరిన్ని వార్తలు