రోస్‌బర్గ్‌కు టైటిల్

1 Jul, 2013 07:04 IST|Sakshi
రోస్‌బర్గ్‌కు టైటిల్

 సిల్వర్‌స్టోన్: ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ తడబడిన చోట... సంయమనంతో డ్రైవ్ చేసి మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన బ్రిటన్ గ్రాండ్‌ప్రి రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. 52 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 32 నిమిషాల 59.456 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఈ రేసు విజేత, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మార్క్ వెబెర్ ఈసారి రెండో స్థానంలో నిలిచాడు.
 
  ఫెరారీ డ్రైవర్ అలోన్సో మూడో స్థానాన్ని సంపాదించాడు. మరోవైపు ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ సొంతగడ్డపై టైటిల్ లోటును తీర్చుకోలేకపోయాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించినా రేసు మధ్యలో అతని కారు టైర్లు పంక్చర్ కావడంతో వెనుకబడిపోయాడు. ఆ తర్వాత తేరుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. తుదకు నాలుగో స్థానంతో ఈ ఇంగ్లండ్ డ్రైవర్ సరిపెట్టుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వెటెల్ 41 ల్యాప్‌ల తర్వాత అతని కారు గేర్‌బాక్స్‌లో సమస్య తలెత్తడంతో రేసు నుంచి వైదొలిగాడు. టైరు పంక్చర్ కావడంతో ఎస్టీఆర్ జట్టు డ్రైవర్ జీన్ వెర్జెన్ 35వ ల్యాప్‌లో నిష్ర్కమించాడు.
 
  భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు కలిసివచ్చింది. ఫోర్స్ ఇండియా ఇద్దరు డ్రైవర్లు టాప్-10లో నిలిచారు. సుటిల్ 7వ స్థానంలో... పాల్ డి రెస్టా 9వ స్థానంలో నిలిచారు. క్వాలిఫయింగ్ సెషన్‌లో పాల్ డి రెస్టా 5వ స్థానం దక్కించుకున్నా నిబంధనలకు విరుద్ధంగా అతని కారు బరువు తక్కువగా ఉండటంతో నిర్వాహకులు జరిమానా విధించారు. ప్రధాన రేసును 5వ స్థానం నుంచి కాకుండా 21వ స్థానం నుంచి ప్రారంభించాలని పాల్ డి రెస్టాను ఆదేశించారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్‌ప్రి ఈ నెల 7న జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు