‘టై’ అయితే సంయుక్త విజేతగా ప్రకటించండి

27 Jun, 2020 00:06 IST|Sakshi

వన్డేల్లో సూపర్‌ ఓవర్‌ వద్దన్న రాస్‌ టేలర్‌

న్యూఢిల్లీ: ఏడాది క్రితం వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఎదుర్కొన్న ఓటమి బాధను న్యూజిలాండ్‌ క్రికెటర్లు అంత సులువుగా మరచిపోయేలా లేరు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కోర్లు సమం కావడం, ఆపై సూపర్‌ ఓవర్‌ కూడా ‘టై’ కావడంతో బౌండరీ కౌంట్‌తో కివీస్‌ ఓడింది. దీనిపై ఆ జట్టు టాప్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ మాట్లాడుతూ... వన్డేల్లో సూపర్‌ ఓవర్‌ అవసరమే లేదని...ఆ నిబంధనను తొలగించి, మ్యాచ్‌ ‘టై’గా ముగిస్తే ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించాలన్నాడు. ‘టి20ల్లో సూపర్‌ ఓవర్‌ అంటే కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఫుట్‌బాల్‌ తరహాలో ఏదో ఒక ఫలితం కోసం అలా ఆడవచ్చు. కానీ వన్డేలో సూపర్‌ ఓవర్‌ ఆడించడమే అసమంజసం. ఇరు జట్లు అప్పటికి 100 ఓవర్లు ఆడి ఉంటాయి. ఇంతసేపు పోటీ పడిన తర్వాత  రెండు జట్లు సమఉజ్జీగా నిలిచాయంటేనే ఎవరూ గెలవలేదనే కదా అర్థం. మ్యాచ్‌ను ‘టై’గా ప్రకటించడంలో తప్పేముంది’ అని టేలర్‌ వ్యాఖ్యానించాడు.

>
మరిన్ని వార్తలు