ఆ విండీస్ ప్లేయర్ అసాధ్యుడు..!!

4 Aug, 2016 09:22 IST|Sakshi
ఆ విండీస్ ప్లేయర్ అసాధ్యుడు..!!

భారత్ విజయాన్ని అడ్డుకున్న రోస్టన్ ఛేజ్
కింగ్స్టన్: భారత్తో జరిగిన రెండో టెస్టులో రాణించిన వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ చెప్పినమాట నిరూపించుకున్నాడు. రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవానికి తాను బౌలర్ను కాదని, ప్రధానంగా తన బలం బ్యాటింగ్ అని తెలిపాడు. బౌలర్ను కాదంటూనే తొలి ఇన్నింగ్స్ లో (5/121) తో ఆకట్టుకున్న ఛేజ్.. బ్యాటింగ్ లోనూ రాణించి విండీస్ ను ఓటమి గండం నుంచి గట్టెక్కించాడు. రెండో టెస్టులో విండీస్ కు కలిసొచ్చిన అంశం ఏంటంటే బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాలలో ఛేజ్ రాణించడం.

304 పరుగులు వెనుకంజలో ఉన్న దశలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ టాపార్డర్ చేతులెత్తిసినా తన కెరీర్ లో తొలి సెంచరీ (269 బంతుల్లో 137‌; 15ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్‌గా నిలిచి భారత బౌలర్లను ఆశ్చర్యపరిచాడు. ఐదు వికెట్లు తీయడంతో పాటు అజేయ సెంచరీ సాధించి 'మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌' అందుకున్నాడు. భారత బౌలర్లు ఎంత శ్రమించినా విండీస్ మాత్రం అంత సులువుగా వికెట్లు సమర్పించుకోలేదు. దాంతో తొలిటెస్టు ఫలితం పునరావృతం కాలేదు.

48/4 దశలో క్రీజులోకి వచ్చిన ఛేజ్, బ్లాక్‌వుడ్ తో కలిసి ఐదో వికెట్‌కు 17.4 ఓవర్లలోనే 93 పరుగులు జోడించాడు. బ్లాక్‌వుడ్‌ను అవుటయ్యాక షేన్ డౌరిచ్ (114 బంతుల్లో 74; 6 ఫోర్లు, 1సిక్స్)తో కలిసి ఆరో వికెట్‌కు  144 పరుగులు జోడించి భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ క్రమంలో తన తొలి సెంచరీ నమోదు చేసుకోవడంతో పాటు చివరగా కెప్టెన్ జాసన్ హోల్డర్(99 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1సిక్స్) తో కలిసి అజేయంగా క్రీజులో నిలిచి జట్టును మరో ఒటమి నుంచి తప్పించాడు.

>
మరిన్ని వార్తలు