ఇంగ్లండ్‌ చితక్కొట్టేసింది..

8 Jun, 2019 19:01 IST|Sakshi

కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పరుగుల మోత మోగించింది. జేసన్‌ రాయ్‌(153; 121 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకానికి తోడు బెయిర్‌ స్టో(51; 50 బంతుల్లో 6 ఫోర్లు), జోస్‌ బట్లర్‌(64; 44 బంతుల్లో  2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్‌ 387 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేపట్టింది. దాంతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ను జేసన్‌ రాయ్‌-బెయిర్‌ స్టోల జోడి ఆరంభించింది. తొలుత పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకున్నాక బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ జోడి 128 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత బెయిర్‌ స్టో తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో జేసన్‌ రాయ్‌కు జత కలిసిన జో రూట్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ 77 పరుగుల్ని జత చేసిన తర్వాత రూట్‌(21) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా,ఆపై మరో 30 పరుగుల వ్యవధిలో రాయ్‌ కూడా ఔటయ్యాడు. దాంతో ఇంగ్లండ్‌ 235 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.

ఆ సమయంలో జోస్‌ బట్లర్‌-ఇయాన్‌ మోర్గాన్‌లు బంగ్లా బౌలర్లపై మరోసారి ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే బట్లర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ 95 పరుగులు జత చేసిన పిదప బట్లర్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై కాసేపటికి మోర్గాన్‌(35), స్టోక్స్‌(6)లు కూడా పెవిలియన్‌ చేరడంతో ఇంగ్లండ్‌ 341 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను నష్టపోయింది. స్కోరును పెంచే క్రమంలో వీరిద్దరూ భారీ షాట్లకు యత్నించి పెవిలియన్‌ చేరారు. చివర్లో క్రిస్‌ వోక్స్‌(18 నాటౌట్‌; 8 బంతుల్లో 2 సిక్సర్లు), ప్లంకెట్‌(27 నాటౌట్‌; 9 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఇది వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు అత్యుత్తమ స్కోరు కాగా, ఓవరాల్‌గా మెగా టోర్నీలో ఏడో అత్యుత్తమ స్కోరుగా నమోదైంది. ఇక వన్డేల్లో బంగ్లాపై ఇంగ్లండ్‌కు ఇది రెండో అత్యుత్తమం. తాజా మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్‌, మెహిదీ హసన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, మోర్తజా, ముస్తాఫిజుర్‌లకు చెరో వికెట్‌ లభించింది.

మరిన్ని వార్తలు