‘ఆర్‌సీబీ’ పేరులో మార్పు?

12 Feb, 2020 19:36 IST|Sakshi

బెంగళూరు : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు పేరు మారబోతుందని బుధవారం ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్‌ మీడియాలో ఆర్‌సీబీకి సంబంధించిన అకౌంట్ల ప్రొఫైల్స్‌లో మార్పులు చోటుచేసుకోవడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో ఆర్‌సీబీ ప్రొఫైల్‌ పిక్చర్స్‌ ఖాళీగా కనిపించడంతో పలువురు ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రస్తావించారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్‌సీబీ పాత పోస్ట్‌లు కనిపించకపోవడం, ట్విటర్‌ ఖాతాలో కేవలం రాయల్‌ చాలెంజర్స్‌గా మాత్రమే పేర్కొనడంతో ఎదో జరుగుతోందంటూ చర్చ ప్రారంభమైంది. 

ఆర్‌సీబీ ఆటగాడు యజ్వేంద్ర చహల్‌ కూడా ఈ విషయాన్ని ట్విటర్‌లో ప్రస్తావించాడు. ప్రొఫైల్‌ పిక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లు ఎక్కడికి వెళ్లాయంటూ సరదాగా ప్రశ్నించారు. మరోవైపు ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ స్ర్కీన్‌ షాట్‌ను షేర్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా అంతా ఓకేనా అని అడిగింది. అయితే ఆర్‌సీబీ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆర్‌సీబీ పేరు మార్పుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని.. ఫిబ్రవరి 16న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఉన్న ‘Bangalore’ను ‘Bengaluru’ గా మార్చనున్నట్టుగా సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఒక్కసారైనా టైటిల్‌ను సొంతం చేసుకోకపోవడం, స్థానిక అభిమానులు Bangalore అని పిలవడానికి అంతగా ఆసక్తి కనబరచకపోవడం వల్లనే ఆ జట్టు పేరు మార్చబోతున్నారనేది ఆ వార్తల సారాంశం. ఆ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే ఆర్‌సీబీ నుంచి అధికార ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే. మరోవైపు ఇటీవల ముత్తూట్‌ ఫిన్‌కార్ఫ్‌తో మూడేళ్ల స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం కుదుర్చుకున్న ఆర్‌సీబీ.. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. 

మరిన్ని వార్తలు