‘కోహ్లి కెప్టెన్సీ మార్పు’పై క్లారిటీ

10 Sep, 2018 12:21 IST|Sakshi

బెంగళూరు: వచ్చే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌కు విరాట్‌ కోహ్లిని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్సీ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అతని స్థానంలో ఏబీ డివిలియర్స్‌ను సారథిగా నియమిస్తున్నట్లు సదరు వార్తల సారాంశం. అయితే దీనిపై ఆర్సీబీ క్లారిటీ ఇచ్చింది.

ఆర్సీబీ జట్టు కెప్టెన్సీ మార్పుపై వచ్చిన వార్తల్లో నిజం లేదు. కెప్టెన్‌గా జట్టుని కోహ్లి సమర్థంగా నడిపిస్తున్నాడు. 2019 సీజన్‌లోనూ అతనే ఆర్‌సీబీ కెప్టెన్’ అని మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. ఐపీఎల్‌లో ఇప్పటికే 10 సీజన్లు ముగియగా.. మూడు సార్లు ఫైనల్‌కి చేరిన బెంగళూరు జట్టు కనీసం ఒకసారి కూడా టైటిల్‌ విజేతగా నిలవలేకపోయింది. 2016లో ఆఖరిసారి ఫైనల్‌ చేరిన ఆర్‌సీబీ.. అక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది.

 2017 సీజన్‌తో పాటు ఈ ఏడాది ముగిసిన సీజన్‌లోనూ ఆర్సీబీ ఘోరంగా విఫలమవడంతో ఇటీవల హెడ్‌ కోచ్‌ డేనియల్ వెటోరీపై ఫ్రాంఛైజీ వేటు వేసింది. అతని స్థానంలో గ్యారీ కిర్‌స్టెన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే కోహ్లి కెప్టెన్సీ పదవికి ఉద్వాసన పలుకుతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై ఆర్సీబీ క్లారిటీ ఇవ్వడంతో కెప్టెన్సీ మార్పు లేదనేది తేలిపోయింది.

మరిన్ని వార్తలు