అండర్-17 ప్రపంచకప్‌కు రూ.228 కోట్లు

29 Dec, 2015 15:11 IST|Sakshi

భారత్‌కు కేటాయించిన ‘ఫిఫా’
 
రియో డి జనీరో: భారత్ ఆతిథ్యమివ్వనున్న అండర్-17 ప్రపంచకప్ (2017) నిర్వహణ కోసం ‘ఫిఫా’ 38 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 228 కోట్లు) కేటాయించింది. సాకర్ ప్రపంచకప్ ఆరంభానికి రెండు రోజుల ముందు సావో పాలోలో జరిగిన ఫిఫా కాంగ్రెస్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.

ఏఐఎఫ్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు సుభాష్ చోప్రా, కోశాధికారి హర్దెవ్ జడేజా, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు అంకుర్ దుత్తా భారత్ ప్రతినిధులుగా ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘కేవలం టోర్నీ నిర్వహణకే ఈ డబ్బును కేటాయించారు. భారత్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని బ్లాటర్ ఆసక్తితో ఉన్నారు. ఆసియా ఫుట్‌బాల్ కూటమి నుంచి మనకు మంచి మద్దతు కూడా లభించింది’ అని చోప్రా పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఉజ్బెకిస్థాన్, అజర్‌బైజాన్‌ల నుంచి గట్టిపోటీ ఎదురైనా భారత్ ఈ బిడ్‌ను గెలుచుకుంది. మరోవైపు ఫిఫాకు చెందిన ఇద్దరు ప్రతినిధుల బృందం దేశంలోని ఎనిమిది వేదికలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.
 

మరిన్ని వార్తలు