రూ. 755 కోట్లు విరాళం

7 Jun, 2020 00:32 IST|Sakshi

వర్ణ వివక్షపై పోరాటానికి అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ మద్దతు

చార్లెట్‌: ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన జాతి వివక్షపై పోరాటానికి అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ ముందుకొచ్చాడు. వర్ణ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడుతోన్న సంస్థలకు జోర్డాన్‌ 10 కోట్ల డాలర్ల (రూ. 755 కోట్లు) విరాళం ప్రకటించాడు. ఇందులో 4 కోట్ల డాలర్లు (రూ. 302 కోట్లు) ‘నైకీ’ రూపొందించిన ‘జోర్డాన్‌ బ్రాండ్‌’ తరపున అందజేస్తారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ‘వివక్ష లేకుండా జాతి సమానత్వం, సామాజిక న్యాయం, విద్యావకాశాలు అనే లక్ష్యాల్ని నెరవేర్చడం కోసం 10 సంవత్సరాలకు పైగా ధనాన్ని సమకూర్చుతాం. ‘నల్లజాతి వారి ప్రాణాలూ ప్రధానమే’. దేశంలో వేళ్లూనుకుపోయిన జాత్యాహంకారం నశించేవరకు, నల్లజాతీయుల జీవితాలను మెరుగుపరిచేందుకు వారిని రక్షించేందుకు మేం కట్టుబడి ఉంటాం’ అని 57 ఏళ్ల చికాగో బుల్స్‌ మాజీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ జోర్డాన్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం జాతీయ బాస్కెట్‌బాల్‌ సంఘం (ఎన్‌బీఏ) జట్టు చార్లెట్‌ హార్నెట్స్‌కు యజమాని అయిన జోర్డాన్‌... పోలీసుల దురాగతానికి ప్రాణాలు కోల్పోయిన జార్జి ఫ్లాయిడ్‌ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు