సఫారీల వేట షురూ

4 Jun, 2017 00:11 IST|Sakshi
సఫారీల వేట షురూ

శ్రీలంకపై ఘనవిజయం
హషీమ్‌ ఆమ్లా శతకం
చాంపియన్స్‌ ట్రోఫీ  


ఓవల్‌: శ్రీలంక జట్టుపై తమ ఆధిపత్యాన్ని దక్షిణాఫ్రికా మరోసారి చాటుకుంది. చాంపియన్స్‌ ట్రోఫీలో శుభారంభం చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా (103; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి సెంచరీకి తోడు స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (4/27)) బౌలింగ్‌ జోరుతో సఫారీ జట్టు 96 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. లంకపై దక్షిణాఫ్రికాకు వరుసగా ఇది ఎనిమిదో విజయం కావడం విశేషం. కెరీర్‌లో 25వ శతకం బాదిన ఆమ్లా 151 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ సాధించి కోహ్లి (162 ఇన్నింగ్స్‌)ని వెనక్కినెట్టాడు.

అంతకుముందు ప్రొటీస్‌ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 299 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌ (75; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆ తర్వాత శ్రీలంక 41.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. తాత్కాలిక కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ (69 బంతుల్లో 57; 6 ఫోర్లు), డిక్‌వెలా (33 బంతుల్లో 41; 5 ఫోర్లు; 1 సిక్స్‌), పెరీరా (66 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) రాణించారు. తాహిర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. గాయం కారణంగా శ్రీలంక రెగ్యులర్‌ కెప్టెన్‌ మాథ్యూస్‌ బరిలోకి దిగలేదు.

ఆమ్లా శతకం
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా శతకం, డు ప్లెసిస్‌ అర్ధ సెంచరీ కీలకంగా నిలిచాయి. అయితే ఆరంభంలో లంక పేసర్లు వేసిన కట్టుదిట్టమైన బంతులకు పరుగులు తీసేందుకు జట్టు ఇబ్బంది పడింది. ఏడో ఓవర్‌లో జట్టుకు తొలి ఫోర్‌ లభించింది. క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బందిపడిన డి కాక్‌ (42 బంతుల్లో 23; 2 ఫోర్లు) 13వ ఓవర్‌లో అవుటయ్యాడు. ఇక్కడి నుంచి ఆమ్లా, డు ప్లెసిస్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో అలరించారు. పిచ్‌ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో వీరిద్దరూ ఆచితూచి ఆడారు. 24వ ఓవర్‌లో ఆమ్లా ఓ సిక్స్‌ బాదగా డు ప్లెసిస్‌ ఓ ఫోర్‌ కొట్టడంతో జట్టు రన్‌నేట్‌ తొలిసారిగా ఐదుకి చేరింది.

52 బంతుల్లో డుప్లెసిస్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ప్రదీప్‌ బౌలింగ్‌లో చండిమాల్‌ అందుకున్న అద్భుత క్యాచ్‌కు అతడు వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రెండో వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. డి విలియర్స్‌ (4) నిరాశపరిచాడు. 112 బంతుల్లో ఆమ్లా సెంచరీ పూర్తి చేసుకోగా... మరుసటి బంతికే మిల్లర్‌ (18; 1 ఫోర్, 1 సిక్స్‌)ను లక్మల్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌ (43)లో ఆమ్లా రనౌట్‌ అయినా... చివర్లో డుమిని (20 బంతుల్లో 38 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), మోరిస్‌ (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) చెలరేగి భారీ స్కోరును అందించారు.

తరంగ ఒక్కడే...
300 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన శ్రీలంక తమ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. ప్రొటీస్‌ పేసర్లపై ఎదురుదాడికి దిగిన ఓపెనర్లు డిక్‌వెల్లా, తరంగ ధాటికి రన్‌రేట్‌ దూసుకెళ్లింది. అయితే ఏడో ఓవర్‌లో వరుసగా 6,4 బాదిన డిక్‌వెలాను మోర్కెల్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు 14 ఓవర్లలోనే వంద పరుగులు చేసిన లంక స్కోరు ఆ తర్వాత ఒక్కసారిగా నెమ్మదించింది. స్పిన్నర్‌ తాహిర్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో మిడిలార్డర్‌ తడబడింది. కపుగెడెరను డకౌట్‌ చేసిన తాహిర్‌ కొద్దిసేపట్లోనే క్రీజులో కుదురుకున్న తరంగను కూడా అవుట్‌ చేయడంతో లంక ఆశలు వదులుకుంది. చివర్లో పెరీరా పోరాటం వృథా అయ్యింది.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: ఆమ్లా రనౌట్‌ 103; డికాక్‌ (సి) డిక్‌వెలా (బి) ప్రదీప్‌ 23; డు ప్లెసిస్‌ (సి) చండిమాల్‌ (బి) ప్రదీప్‌ 75; డివిలియర్స్‌ (సి) కపుగెడెర (బి) ప్రసన్న 4; మిల్లర్‌ (సి) ప్రసన్న (బి) లక్మల్‌ 18; డుమిని నాటౌట్‌ 38; మోరిస్‌ రనౌట్‌ 20; పార్నెల్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 299.
వికెట్ల పతనం: 1–44, 2–189, 3–194, 4–226, 5–232, 6–277.
బౌలింగ్‌: మలింగ 10–0–57–0, లక్మల్‌ 10–0–51–1, ప్రదీప్‌ 10–0–54–2, గుణరత్నే 10–0–64–0; ప్రసన్న 10–0–72–1.

శ్రీలంక ఇన్నింగ్స్‌: డిక్‌వెలా (సి) పార్నెల్‌ (బి) మోర్కెల్‌ 41; తరంగ (సి) మిల్లర్‌ (బి) తాహిర్‌ 57; మెండిస్‌ (సి) డివిలియర్స్‌ (బి) మోరిస్‌ 11; చండిమాల్‌ రనౌట్‌ 12; కపుగెడెర ఎల్బీడబ్ల్యూ (బి) తాహిర్‌ 0; పెరీరా నాటౌట్‌ 44; గుణరత్నే (సి) పార్నెల్‌ (బి) తాహిర్‌ 4; ప్రసన్న ఎల్బీడబ్ల్యూ (బి) మోరిస్‌ 13; లక్మల్‌ రనౌట్‌ 0; మలింగ (బి) రబడ 1; ప్రదీప్‌ (సి) డుమిని (బి) తాహిర్‌ 5; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (41.3 ఓవర్లలో ఆలౌట్‌) 203.
వికెట్ల పతనం: 1–69, 2–94, 3–116, 4–117, 5–146, 6–155, 7–191, 8–191, 9–192, 10–203.
బౌలింగ్‌: రబడ 8–1–46–1, పార్నెల్‌ 10–0–54–0, మోర్కెల్‌ 6–0–31–1, మోరిస్‌ 7–0–32–2, ఇమ్రాన్‌ తాహిర్‌ 8.3–0–27–4, డుమిని 2–0–7–0.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా