కృత్రిమ కొరత.. మండిపడ్డ క్రికెటర్‌

21 Mar, 2020 19:26 IST|Sakshi

ఢాకా: డబ్బులకు కక్కుర్తిపడే వ్యాపారవేత్తలే అసలైన కరోనా వైరస్‌ అని బంగ్లాదేశ్‌ బౌలర్‌ రూబెల్‌ హుస్సేన్‌ మండిపడ్డాడు. ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని మాస్కులు, శానిటైజర్ల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహమ్మారి కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టే క్రమంలో మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌లకు డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో వ్యాపారులు వాటి ధరను అమాంతం పెంచేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన రూబెల్‌ హుస్సేన్‌ సోషల్‌ మీడియా వేదికగా వ్యాపారుల తీరును ఎండగట్టాడు. తమది అత్యాశ, నిర్దయతో కూడిన జాతి అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.(ఆయనకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు: మేరీ కోమ్‌)

‘‘చైనా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో అక్కడి వ్యాపారులు మాస్కుల ధరను తగ్గించారు. ఎందుకంటే వాళ్లు మనుషులు. కానీ మా దేశంలో అలా కాదు. కరోనా గురించి విన్ననాటి నుంచి ఐదు టాకాల ధర గల మాస్కు ధర 50 టాకాలకు పెరిగింది. 20 టాకాల ధర గల మాస్కును 100 లేదా 150 టాకాలకు అమ్ముతున్నారు. ఎందుకంటే మేం అత్యాశపరులం. కఠిన సమయాల్లో స్వాతంత్ర్యం కోసం పోరాడిన హీరోలను నేను గుర్తుచేసుకుంటా. కానీ ఈరోజు సంక్షోభ పరిస్థితులు తలెత్తిన సమయంలో మనమంతా ఒక్కటిగా నిలబడలేకపోతున్నాం. ఎందుకు? మాస్కులు, శానిటైజర్ల ధర పెరిగిపోయింది. దురాశతో లాభాల కోసం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నిజంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ వాళ్లే’’అంటూ రూబెల్‌ ఫేస్‌బుక్‌లో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు.

కాగా బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకు 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా... ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు కోలుకున్నారు. ఇక ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల మరణాలు సంభవించాయి. రెండున్నర లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు.(మీ నాయకత్వం అచ్చం అలాగే: పీటర్సన్‌)

>
మరిన్ని వార్తలు