రసెల్‌ దెబ్బకు సన్‌ డౌన్‌

25 Mar, 2019 02:29 IST|Sakshi

తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన హైదరాబాద్‌

ఆరు వికెట్లతో నైట్‌రైడర్స్‌ ఘనవిజయం

కోల్‌కతాను గెలిపించిన రసెల్‌  

విజయానికి చివరి 3 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. ఐపీఎల్‌లో గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత ఇది. కానీ ఆండ్రీ రసెల్‌ పవర్‌ హిట్టింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అలాంటి లక్ష్యాన్ని అందుకుంది. సిద్ధార్థ్‌ కౌల్‌ వేసిన 18వ ఓవర్లో 2 సిక్సర్లు, ఫోర్‌ బాదిన రసెల్‌... భువనేశ్వర్‌ వేసిన 19వ ఓవర్లో మరో 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి 40 పరుగులు వచ్చేశాయి. షకీబ్‌ వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా... ఈ సారి నేనున్నానంటూ శుబ్‌మన్‌ గిల్‌ 2 సిక్సర్లతో చెలరేగి 2 బంతుల ముందే ఆట ముగించాడు. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను పలకరించగా ...సొంతగడ్డపై కేకేఆర్‌ సంబరాల్లో మునిగిపోయింది.   

కోల్‌కతా: ఐపీఎల్‌ తొలి రోజు ఆటతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు రెండో రోజు అసలైన వినోదం లభించింది. కోల్‌కతా, హైదరాబాద్‌ జట్లు పోటీ పడి పరుగుల వరద పారించాయి. చివరకు ఆండ్రీ రసెల్‌ మెరుపులు లీగ్‌లో జోష్‌ తెచ్చాయి. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (53 బంతుల్లో 85; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్‌లో 37వ అర్ధసెంచరీతో ఘనంగా పునరాగమనం చేయగా, విజయ్‌ శంకర్‌ (24 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (47 బంతుల్లో 68; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆండ్రీ రసెల్‌ (19 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగగా, ఉతప్ప (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.  

వార్నర్‌ జోరు... 
బాల్‌ ట్యాంపరింగ్‌తో గత ఏడాది లీగ్‌కు దూరమైన వార్నర్‌ మళ్లీ తన సత్తాను ప్రదర్శించాడు. చావ్లా వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి అతను తన రాకను తెలియజేశాడు. అదే ఓవర్‌ ఐదో బంతికి కోల్‌కతా ఎల్బీ కోసం అప్పీల్‌ చేయగా అంపైర్‌ తిరస్కరించాడు. అయితే రీప్లేలో నాటౌట్‌ అని స్పష్టంగా తేలడంతో కోల్‌కతా రివ్యూ కోల్పోయింది. ఆ తర్వాత నరైన్‌ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన వార్నర్‌... రసెల్‌ మొదటి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. ఈ సిక్సర్‌తో 31 బంతుల్లోనే వార్నర్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. అనంతరం 68 పరుగుల వద్ద వార్నర్‌ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్‌ కార్తీక్‌ వదిలేశాడు. సెంచరీ ఖాయమనుకున్న దశలో ఎట్టకేలకు వార్నర్‌ ఆటను రసెల్‌ ముగించాడు. అతని ఓవర్లో భారీ సిక్సర్‌ కొట్టిన తర్వాత మరో బలమైన షాట్‌కు ప్రయత్నించగా కవర్స్‌లో ఉతప్ప అద్భుత క్యాచ్‌ పట్టడంతో వార్నర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.  

బెయిర్‌స్టో మొదటి మ్యాచ్‌... 
ఇంగ్లండ్‌ తరఫున గత కొంత కాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టోకు తొలిసారి ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది. తొమ్మిదేళ్లలో వేర్వేరు జట్ల తరఫున 99 టి20లు ఆడిన అతనికి ఆదివారం మ్యాచ్‌ 100వ టి20 కావడం విశేషం. చావ్లా బౌలింగ్‌లో చక్కటి సిక్సర్‌తో తొలి బౌండరీ రాబట్టిన అతను ఆ తర్వాత మరో మూడు ఫోర్లు కొట్టాడు. వార్నర్, బెయిర్‌స్టో కలిసి 77 బంతుల్లో 118 పరుగులు జోడించారు. మరోవైపు భారత జట్టులో వరుస అవకాశాలు లభించిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిన విజయ్‌ శంకర్‌ ఐపీఎల్‌లో కూడా దానిని చూపించాడు. నరైన్, ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లలో అతను ఒక్కో సిక్సర్‌ బాదాడు. 27 పరుగుల వద్ద అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో బతికిపోయిన అతను అదనంగా మరో 13 పరుగులు జోడించగలిగాడు.  

కీలక భాగస్వామ్యం... 
భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఆరంభంలోనే క్రిస్‌ లిన్‌ (7) వికెట్‌ కోల్పోయింది. అయితే నితీశ్‌ రాణా, ఉతప్ప భాగస్వామ్యం ఆ జట్టును రేసులో నిలిపింది. సందీప్‌ శర్మ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్‌ కొట్టి రాణా దూకుడు ప్రదర్శించగా, ఉతప్ప కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 58 బంతుల్లో 80 పరుగులు జోడించారు. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (2) విఫలం కాగా, 35 బంతుల్లో రాణా అర్ధ సెంచరీ చేశాడు.  

లైట్స్‌ ఆఫ్‌!  
ఈడెన్‌ గార్డెన్స్‌లో ఒక ఫ్లడ్‌ లైట్‌ టవర్‌ పని చేయకపోవడంతో 16వ ఓవర్లో ఆట ఆగిపోయింది. దాదాపు 13 నిమిషాల తర్వాత మళ్లీ మ్యాచ్‌ మొదలైంది.  

భువనేశ్వర్‌ రెండోసారి... 
సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అతని స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. తన కెరీర్‌లో భువీ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి మాత్రమే. 2016–17 రంజీ ట్రోఫీలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అతను యూపీకి కెప్టెన్‌గా పని చేశాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు