ఎన్నికలు నిర్వహిస్తే నిషేధం ఎత్తివేస్తాం!

12 Dec, 2013 01:18 IST|Sakshi
ఎన్నికలు నిర్వహిస్తే నిషేధం ఎత్తివేస్తాం!

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా భారత్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే దిశగా తొలి అడుగుపడింది. కళంకిత వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తమ రాజ్యాంగాన్ని సవరించుకోవడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సంతృప్తి వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే ఒలింపిక్స్‌లోకి తిరిగి అడుగుపెట్టేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. థామస్ బ్యాచ్ అధ్యక్షతన తొలిసారి జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘ఐఓసీ చేసిన విజ్ఞప్తి మేరకు... ఆదివారంనాడు భారత సంఘం తమ రాజ్యాంగాన్ని సవరించుకుంది. ఇది మంచి పరిణామం. దీన్ని ఎగ్జిక్యూటివ్ బోర్డు స్వాగతిస్తోంది. సవరించిన రాజ్యాంగానికి ఐఓసీ ఆమోదం తెలుపుతుంది.
 
 కాబట్టి వీలైనంత త్వరగా ఐఓఏ ఎన్నికలు నిర్వహించుకుంటే బాగుంటుంది’ అని ఐఓసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఫిబ్రవరి 9న తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఐఓఏ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు నిర్వహించడంలో ఐఓఏ విఫలమైతే భారత్ అథ్లెట్లు సోచీలో జరిగే వింటర్ గేమ్స్ (ఫిబ్రవరి 7-23)లో ఒలింపిక్ పతాకం కింద ఆడాల్సి ఉంటుందని ఐఓసీ హెచ్చరించింది. ఈ ఈవెంట్‌లో భారత పతాకం, గుర్తులు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
 
 స్వాగతించిన క్రీడాశాఖ
 ఎన్నికలు నిర్వహిస్తే నిషేధాన్ని ఎత్తివేస్తామన్న ఐఓసీ నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ బుధవారం స్వాగతించింది. ‘ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు తమ జాతీయ పతాకం కింద పాల్గొనడానికి ఐఓసీ నిర్ణయం దోహదం చేస్తుంది. దేశం తరఫున ఆడటాన్ని ఆటగాళ్లు గొప్ప గౌరవంగా భావిస్తారు. అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ఇది ప్రోత్సాహాన్నిస్తుంది కూడా’ అని క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐఓఏ, ఐఓసీల మధ్య తలెత్తిన ప్రతిష్టంభనను తొలగించేందుకు క్రీడాశాఖ కూడా చురుకుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుత పరిణామాల పట్ల మేటి షూటర్ అభినవ్ బింద్రా సంతృప్తి వ్యక్తం చేశాడు. సోచీ గేమ్స్ వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగాలన్నాడు.
 

మరిన్ని వార్తలు