రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యను సస్పెండ్ చేయండి

11 Nov, 2015 00:26 IST|Sakshi
రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యను సస్పెండ్ చేయండి

‘వాడా’ కమిషన్ నివేదిక
 
జెనీవా: విచ్చలవిడిగా డోపింగ్‌కు పాల్పడుతున్న రష్యా అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఆర్‌ఏఫ్) అథ్లెట్లపై... 2016 రియో ఒలింపిక్స్‌తో సహా ఏ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా)కు చెందిన ముగ్గురు సభ్యుల ఇండిపెండెంట్ కమిషన్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన చాలా ఆధారాలను సేకరించిన కమిషన్ ఓ భారీ నివేదికను తయారు చేసినట్లు సమాచారం. రష్యా ప్రభుత్వ అనుమతితో డోపింగ్ మోసం ఓ క్రమబద్ధంగా జరుగుతున్నట్లు ఆధారాలతో సహా వెల్లడించింది. ఏమాత్రం విశ్వసనీయత లేని రష్యా ల్యాబ్‌ల్లో అథ్లెట్లకు డ్రగ్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారని తెలిపింది.

ఈ పరిణామం చాలా ఆందోళన కలిగిస్తోందని కమిషన్‌కు నేతృత్వం వహించిన ‘వాడా’ మాజీ చీఫ్ రిచర్డ్ పౌండ్ ఆరోపించారు. తాము ఆలోచించిన దానికంటే చాలా ఎక్కువగా మోసం జరుగుతుందన్నారు. ప్రపంచం మొత్తం డోపింగ్ నిబంధనలను పాటిస్తున్నా.. వీటికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న రష్యా సమాఖ్యపై వేటు వేయాలని అంతర్జాతీయ అథ్లెటిక్స్ గవర్నింగ్ బాడీ (ఐఏఏఎఫ్)కి ప్రతిపాదించింది. కమిషన్ నివేదికపై స్పందించేందుకు రష్యాకు శుక్రవారం వరకు గడువు ఇచ్చామని ఐఏఏఎఫ్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో అన్నారు. ఆరోపణలు చూసి షాక్‌కు గురయ్యామని, వాటిపై రష్యా వివరణ ఇవ్వాల్సిందేనన్నారు.
 

మరిన్ని వార్తలు