ఫైనల్లో రుత్విక

3 Dec, 2017 01:03 IST|Sakshi

 టాటా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ  

ముంబై: సొంతగడ్డపై సింగిల్స్‌ విభాగాల్లో టైటిల్స్‌ సాధించేందుకు భారత క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, లక్ష్య సేన్‌ మరో విజయం దూరంలో ఉన్నారు. టాటా ఓపెన్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి రుత్విక, ఉత్తరాఖండ్‌ కుర్రాడు లక్ష్య సేన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో రుత్విక 21–17, 21–9తో ఎం.థినా (మలేసియా)పై గెలుపొందింది. మరో సెమీఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన ఇరా శర్మ 22–24, 21–11, 19–21తో రియా ముఖర్జీ (భారత్‌) చేతిలో పోరాడి ఓడింది.

ఆదివారం జరిగే ఫైనల్లో రియా ముఖర్జీతో రుత్విక తలపడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో లక్ష్య సేన్‌ 21–10, 21–12తో అభిషేక్‌ యెలెగార్‌ (భారత్‌)ను ఓడించాడు. రెండో సెమీఫైనల్లో సితికోమ్‌ థమాసిన్‌ (థాయ్‌లాండ్‌) 22–20, 21–6తో మిథున్‌ మంజునాథ్‌ (భారత్‌)పై గెలిచి లక్ష్య సేన్‌తో టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాడు. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి (భారత్‌) ద్వయం 14–21, 20–22తో మనీపోంగ్‌ జోంగ్‌జిత్‌–నాంతకర్న్‌ యోర్డ్‌ఫైసాంగ్‌ (థాయ్‌లాండ్‌) జంట చేతిలో ఓడిపోయింది.   

మరిన్ని వార్తలు