రంజీ, వినూ మన్కడ్‌ టోర్నీలు మాత్రమే! 

20 Jul, 2020 00:27 IST|Sakshi

ముంబై: దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ను కరోనా మింగేయనుంది. దేశంలో వైరస్‌ విలయతాండవం అంతకంతకూ పెరిగిపోతోంది. ఆటలకు బాటలే పడట్లేదు. దీంతో ప్రస్తుత కరోనా సీజన్‌లో దేశవాళీ టోర్నీలను రెండుకే పరిమితం చేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. 2020–21లో సీనియర్ల కోసం రంజీ ట్రోఫీ... కుర్రాళ్ల కోసం అండర్‌–19 వినూ మన్కడ్‌ ట్రోఫీల ను మాత్రమే నిర్వహిస్తారు. దులీప్, దేవధర్, విజయ్‌ హజారే, సీకే నాయుడు (అండర్‌–23) టోర్నీలు అసాధ్యమేనని బోర్డు భావించింది. వీలు ను బట్టి ముస్తాక్‌ అలీ టి20 టోర్నీకి చోటిచ్చింది. రంజీ కూడా ఇపుడున్న ఎలైట్, ప్లేట్‌ కాకుండా పాత పద్ధతిలోనే నిర్వహించే అవకాశముంది. అంటే ఐదు జోన్ల (నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్‌)లోని జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. తదుపరి జోన్‌ విజేతలకు (పాయింట్ల పట్టికలో జోన్‌ టాపర్‌) నాకౌట్‌ పద్ధతిలో నిర్వహించి విజేతను తేలుస్తారు.

సాబా కరీమ్‌ రాజీనామా
మరోవైపు బీసీసీఐ జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌ ఆపరేషన్స్‌) పదవికి సాబా కరీమ్‌ రాజీనామా చేశాడు.  ఇటీవల బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రి కూడా తన పదవికి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐలో కొత్త ప్రొఫెషనల్స్‌ టీమ్‌ రాబోతుందనే చర్చ మొదలైంది. భారత మాజీ వికెట్‌ కీపర్‌ అయిన సాబా కరీమ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌ బాధ్యతల్ని నిర్వర్తించేవాడు.

మరిన్ని వార్తలు