సచిన్-కాంబ్లి వివాదం ముగిసిందా!

25 Oct, 2017 19:10 IST|Sakshi

ముంబయి : చిన్ననాటి స్నేహితులు.. భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లిల మధ్య వివాదాలు సమసిపోయాయా.. వారు గతంలో మాదిరిగా తమ స్నేహాన్ని కొనసాగించనున్నారా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందట స్నేహితుడు సచిన్ పై కాంబ్లి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన కెరీర్ పతనం అవుతున్నప్పుడు ప్రొఫెషన్ పరంగా గానీ, వ్యక్తిగతంగా కానీ సచిన్ తనకు అండగా ఉండలేదని.. ఎలాంటి మద్ధతు తెలపలేదని ఓ టీవీ షోలో తన అవేదన వ్యక్తం చేస్తూ కాంబ్లి కన్నీటి పర్యంతమవడాన్ని ఏ క్రికెట్ ప్రేమికుడు అంత సులువుగా మరిచిపోలేదు.

కాంబ్లి వ్యాఖ్యలపై సచిన్ స్పందించకుండా ఉన్న మాట వాస్తవమే. అలాగనీ స్నేహితుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సందర్భంలోనూ సచిన్ వెళ్లి కలవలేదు. ఆపై తన ఆటో బయోగ్రఫీ విడుదలకు గానీ, సచిన్ వీడ్కోలు కార్యక్రమానికి సైతం కాంబ్లికి ఆహ్వానం అందకపోవడం గమనార్హం. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అందరూ భావించారు. అలా అనుకున్నవారు తప్పులో కాలేసినట్లే. అందుకు ఇటీవల జరిగిన ఈవెంట్ నిదర్శనంగా చెప్పవచ్చు.

సచిన్-కాంబ్లి సెల్ఫీలతో సందడి!
ముంబైలో ఇటీవల జరిగిన ఓ పుస్తకావిష్కరణకు సచిన్, కాంబ్లి, రాజ్ దీప్ సర్దేశాయ్, అటుల్ కస్బేకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంబ్లి తన చిన్ననాటి మిత్రుడు సచిన్ తో కలిసి తొలిసారి సెల్ఫీ దిగాడు. 'అటుల్, శిశిర్ హట్టంగడి, రాజ్ దీప్ సర్దేశాయ్, సచిన్ లను కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మాస్లర్ బ్లాస్టర్ ఐ లవ్ యూ అంటూ' కాంబ్లి ట్వీట్ చేశాడు. 'మిత్రులందరికీ చెబుతున్నాను. ఇది నా మిత్రుడు సచిన్, నేను తీసుకున్న మొట్టమొదటి సెల్ఫీ' అని హర్షం వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ లో రాసుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ కాంబ్లి. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారు. ఇకనుంచి వీరి మధ్య విభేదాలు రావంటూ క్రికెట్ ప్రేమికులు కామెంట్ చేస్తున్నారు.
 


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా