అర్జున్‌ ఎంపికపై సచిన్‌ ఏమన్నాడంటే ?

8 Jun, 2018 16:35 IST|Sakshi
సచిన్‌ టెండూల్కర్‌, అర్జున్‌ టెండూల్కర్‌ (ఫైల్‌ ఫొటో)

ముంబై : క్రికెట్‌లో రారాజుగా వెలిగిపోయిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ భారత అండర్‌-19 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. కుమారుడి ఎంపిక పట్ల సచిన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘అర్జున్‌ అండర్‌-19 జట్టుకు ఎంపికవ్వడం మాకు సంతోషాన్నిచ్చింది. అతని క్రికెట్‌ జీవితంలో ఇదొక గొప్ప మైలురాయి. నేను, అంజలి ఎప్పుడు అర్జున్‌ను ప్రోత్సహిస్తాం. అతను బాగా రాణించాలని కోరుకుంటాం’ అని సచిన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా సైతం అర్జున్‌ ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అతన్ని అభినందించారు. టోర్నీల్లో అద్భుతంగా రాణించాలని ఆకాక్షించారు. ఇక అర్జున్‌ కూడా సచిన్‌ పేరు నిలబెడుతాడని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

వివిధ వయోవిభాగాల్లో నిలకడగా రాణించిన అర్జున్‌ తొలిసారి టీమిండియా ‘బ్లూ’ జెర్సీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్‌–19 జట్టులోకి అతను ఎంపికయ్యాడు. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్‌ జట్టు లంకలో 2 నాలుగు రోజుల మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఈ లిటిల్‌ టెండూల్కర్‌ లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ జాతీయ అండర్‌–19 టోర్నీ కూచ్‌బెహర్‌ ట్రోఫీలో  ముంబై తరఫున 18 వికెట్లతో రాణించిన అతని ప్రదర్శన భారత జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది.  

>
మరిన్ని వార్తలు