కోహ్లి సేనకు సచిన్‌ సూచనలు

3 Dec, 2018 16:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్‌ జట్టుకు కొన్ని టిప్ప్‌ను సూచించాడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. ఈసారి ఆసీస్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ను గెలిచే అవకాశం టీమిండియాకు ఉందన‍్న సచిన్‌.. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఓపెనర్ల పాత్ర చాలా కీలకంగా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలవాలంటే ఓపెనర్ల ఆటే టీమిండియాకు ఎంతో కీలకమని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ సిరీస్‌లో భారం ఓపెనర్లదేనని సచిన్ స్పష్టం చేశాడు. 30 నుంచి 35 ఓవర్ల వరకు ఓపెనర్లు క్రీజులోనే ఉండే ప్రయత్నం చేయాలని అన్నాడు.

‘ఆస్ట్రేలియాలాంటి దేశాలకు వెళ్లినపుడు ఓపెనర్లే చాలా కీలకం. ఎందుకంటే బంతి కొత్తగా ఉంటుంది. దానికి తోడు ఫాస్ట్ బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తారు. ఈ క్రమంలో సహనంతో ఆడాలి. లేకపోతే, ఆరంభంలోనే ఒకటి లేదా రెండు వికెట్లే కాదు.. ఒక్కోసారి మూడు, నాలుగు వికెట్లు కూడా చేజార్చుకునే ప్రమాదం ఉంది.బంతి గట్టిగా ఉన్నపుడు ఈ సమయం దొరకదు. ఆస్ట్రేలియాలో 35 ఓవర్ల తర్వాత పేస్ బౌలర్లకు అంత సహకారం లభించదు. అయితే పచ్చిక ఎక్కువగా ఉన్న పిచ్‌లైతే మాత్రం మరి కొన్ని ఓవర్లు బౌలర్లకే సహకరిస్తాయి. ఆసీస్ జట్టులో వార్నర్, స్మిత్ లేకపోవడం కచ్చితంగా టీమిండియాకు కలిసొచ్చేదే. ఇది కోహ్లి సేనకు సువర్ణావకాశం’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ గురువారం నుంచి ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు