క్రికెట్ డెవిల్

29 Oct, 2015 01:30 IST|Sakshi
క్రికెట్ డెవిల్

మనమంతా సచిన్ టెండూల్కర్ ఆటను చూశాం. ఏ షాట్ ఆడినా కళాత్మకం. సాంకేతికతకు పెట్టిందిపేరు. లెక్కలేనన్ని రికార్డులు. పుస్తకాల్లో రాసిన షాట్లను మైదానంలో ఆడి చూపించాడు. కోట్లాది మందికి క్రికెట్ ‘దేవుడు’ అయ్యాడు.

ఇప్పుడు డివిలియర్స్‌ను చూస్తున్నాం. సాంకేతికతతో పనిలేదు. తాను ఆడిందే షాట్... వల్లించిందే వేదం. ఏమాత్రం బౌలర్లంటే కనికరం లేదు. జాలి అనే మాటే తెలియదు. బౌలర్లను ఊచకోత కోస్తూ... ప్రత్యర్థి ఆటగాళ్లను భయపెడుతూ క్రికెట్ ‘దెయ్యం’లా తయారయ్యాడు.

అవును అబ్రహం బెంజమిన్ డివిలియర్స్... ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఈ దక్షిణాఫ్రికా స్టార్... రికార్డులన్నీ తన ఖాతాలో చేర్చుకుంటున్నాడు. తాజాగా భారత్‌తో వన్డే సిరీస్‌లో అతని విధ్వంసం ఆకాశాన్నంటింది.సాక్షి క్రీడా విభాగం:
‘బ్యాటింగ్ చేసేటప్పుడు నేను పెద్దగా శ్రమించను. సింపుల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా’... ముంబై వన్డే తర్వాత డివిలియర్స్ వ్యాఖ్య ఇది. సింపుల్‌గా ఉండటమే ఇలా ఉంటే... మరి కాస్త ‘కష్టపడి’ ఆడితే ఎలా ఉంటుందనేది సగటు క్రికెట్ అభిమానికి వచ్చే సందేహం. ఒక మ్యాచ్ కాదు, రెండు మ్యాచ్‌లు కాదు...గత కొన్నేళ్లలో డివిలియర్స్ బ్యాటింగ్ చూస్తే అతను ఒంటిచేత్తో విజయాలు అందించినవి, బౌలర్లకు చుక్కలు చూపిం చినవి ఎన్నో ఉన్నాయి.

తాజాగా బాధితుల జాబితాలో చేరింది మాత్రం భారత జట్టే. సకల కళా వల్లభుడిలాగా గోల్ఫ్, రగ్బీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టెన్నిస్... ఇలా ఎన్నో క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న ఏబీకి చివరి మజిలీ క్రికెట్ అయింది. ఆ నిర్ణయం ప్రపంచానికి కొత్త తరహా వినోదాన్ని పంచింది.
 
ఇలా కూడా ఆడవచ్చా...
డివిలియర్స్ ముద్దు పేరు మిస్టర్ 360... నిజంగానే క్రికెట్ ప్రపంచంలో 360 డిగ్రీల కోణంలో షాట్లు ఆడటం అతనికి మాత్రమే సొంతమైన ప్రతిభ. అప్పుడెప్పుడో షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో సచిన్ అప్పర్‌కట్‌లో ఆఫ్‌సైడ్‌లో కొట్టిన సిక్సర్‌కు అచ్చెరువొందాం. అలాంటి షాట్లు ఏబీకి మంచినీళ్ల ప్రాయం. అందుకే మాస్టర్ కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయినట్లున్నాడు. ఆధునిక క్రికెట్‌లో కొందరు ఆటగాళ్లకు తమదైన ట్రేడ్‌మార్క్ షాట్లు ఉంటాయి.

దాంతోనే వారు సాధ్యమైనన్ని పరుగులు రాబడతారు. కానీ డివిలియర్స్‌కు అలాంటి షాట్ ఏమీ లేదు. ఎందుకంటే వారందరి షాట్లూ తానొక్కడే ఆడేయగలడు. తన బుర్రతో మరి కాస్త కొత్తగా ఆలోచించి అతను కనుగొన్న షాట్లకు ఎవరూ పేరు కూడా పెట్టలేకపోయారు! బాసింపట్టు వేసినట్లుగా కూర్చొని కూడా భారీ సిక్సర్ బాదడం, రివర్స్ స్వీప్‌తో అలవోకగా స్టాండ్స్‌లోకి బంతిని పంపించడం, స్విచ్ హిట్‌తో ప్రత్యర్థి బౌలర్ మైండ్ బ్లాంక్ చేయడం... ఒకటేమిటి ఇలా కొత్తదనానికి చిరునామాగా అతను మారిపోయాడు.

కళాత్మకంగా అతను ఆడే డ్రైవ్ మాత్రమే కాదు...ఆన్ సైడ్‌లో మిడ్ వికెట్ మీదుగా లెక్క లేనన్ని సార్లు కొట్టిన సిక్సర్లు చూస్తే పుల్ షాట్ కూడా ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. టి20లో వీర బాదుడు, వన్డే అయితే క్లాసిక్ ఇన్నింగ్స్, టెస్టు కోసమైతే కొసరి కొసరి కుదురైన, తెలివైన ఇన్నింగ్స్... ఇలా ఆచితూచి లెక్కగట్టి ఆడటం డివిలియర్స్‌కే చెల్లుతుంది.
 
ఆరంభం అంతంత మాత్రమే
చాలా మంది దిగ్గజాలలాగే డివిలియర్స్ కెరీర్ కూడా సాదాసీదాగానే ఆరంభమైంది. తొలి టెస్టులోనే ఓపెనర్‌గా దిగిన అతను పెద్దగా ఆకట్టుకోలేదు. చాలా రోజుల వరకు అందరిలో ఒకడిగానే ఉండిపోయాడు. జట్టు అవసరం కొద్దీ ఒకటో నంబర్‌నుంచి ఎనిమిదో స్థానం వరకు కూడా అతను బ్యాటింగ్‌కు దిగాడు. అయితే 2008లో అహ్మదాబాద్‌లో భారత్‌పై డబుల్ సెంచరీ చేసిన తర్వాతే అతనికి టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు దక్కింది.

ఈనాడు విధ్వంసకారుడిగా కనిపిస్తున్న డివిలియర్స్ వన్డేల్లో తొలి మ్యాచ్ ఆడిన రెండున్నరేళ్లకు గానీ మొదటి సెంచరీ కొట్టలేకపోయాడు. అది కూడా 2007 ప్రపంచకప్‌లో ఘోరమైన ఫామ్‌తో మూడు డకౌట్ల తర్వాత వచ్చిన శతకం! ఆ తర్వాత నిలకడ కొనసాగించినా... మరో రెండేళ్లకు అతనిలోని అసలైన హిట్టర్ బయటికి వచ్చాడు.
 
చరిత్రలో స్థానం
డివిలియర్స్ ఆటను, శైలిని వర్ణించేందుకు సాధారణ విశేషణాలు సరిపోక పదాలు తడుముకునే పరిస్థితి. అయితే గొప్ప ఆటగాడు, దిగ్గజం అనే మాటలకు మించి అతనిలో ఏదో మాయ ఉంది. ప్రస్తుతం వన్డేల్లో 50కు పైగా సగటు, 100కు పైగా స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక క్రికెటర్ అతను. కొంత కాలం ఇదే జోరును కొనసాగిస్తే కొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఒకప్పుడు ఇలా ఆడే క్రికెటర్ కూడా ఉండేవాడు... అని భవిష్యత్ తరాలు చెప్పుకునే కథల్లో అతను నాయకుడిగా నిలిచిపోవడం మాత్రం ఖాయం.
 
రికార్డులే రికార్డులు...
2009లో నవంబర్‌లో కేప్‌టౌన్‌లో ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్. దూకుడైన బ్యాటింగ్‌తో 75 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతే...అంతకు ముందు సాధించిన 3 సెంచరీలతో పోలిస్తే తర్వాతి 20 సెంచరీలు ఏబీ భీకర బ్యాటింగ్‌కు నిదర్శనంగా నిలిచాయి. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న తరుణంలో రావడం... అంతలోనే తుఫాన్‌లా మార్చేయడం డివిలియర్స్‌కు దినచర్యగా మారిపోయింది.

కేప్‌టౌన్ మ్యాచ్‌నుంచి భారత్‌తో ఐదో వన్డే వరకు డివిలియర్స్ 100 ఇన్నింగ్స్‌లు ఆడి 5454 పరుగులు చేశాడు. సగటు 69.03 కాగా, స్టైక్‌రేట్ 110.51గా ఉండటం అతని సత్తా ఏమిటో చూపిస్తుంది. కెరీర్‌లోని 23 సెంచరీలు కూడా 100కు పైగా స్ట్రైక్‌రేట్‌తో చేయడం ఒక్క ఏబీకే సాధ్యమైంది. 25వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌కు దిగి కూడా ఐదు సార్లు శతకం మార్క్‌ను చేరుకోవడం మరే క్రికెటర్ వల్ల కాలేదు. ఈ ఏడాదైతే అతను పరుగుల పండగ చేసుకున్నాడు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతులు), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతులు), ఫాస్టెస్ట్ 150 (64 బంతులు)... ఇలా ప్రతీ రికార్డు అతని చెంతకే చేరింది.

మరిన్ని వార్తలు