‘రోహిత్‌కు సమానంగా బుమ్రా’

8 Jul, 2019 08:59 IST|Sakshi

జస్ప్రీత్‌ బుమ్రాపై సచిన్‌ ప్రశంసలు

లండన్‌ : యార్కర్‌ కింగ్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసలు కురిపించాడు. అద్భుత విజయాలతో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోవడానికి హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ కృషికి సమానంగా బుమ్రా కూడా కష్టపడ్డాడని పేర్కొన్నాడు. అయితే, వికెట్లు తీయడంలో కొంచెం ఇబ్బంది పడుతున్న బుమ్రా జట్టు విజయాల్లో మాత్రం తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడని కొనియాడాడు. ఇక శ్రీలంకతో జరిగిన చివరి లీగ్‌మ్యాచ్‌లో కోహ్లి సేన ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బుమ్రా కరుణరత్నే, కుశాల్‌ పెరీరా, మాథ్యూస్‌ వికెట్లు తీశాడు.

మరే భయపడాల్సింది లేదు..
గతంలో మాదిరిగా బుమ్రా రాణించనిపక్షంలో టీమిండియా మరేదైనా ప్లాన్‌తో ఉంటుందా అన్న ప్రశ్నకు సచిన్‌ స్పందిస్తూ.. ‘నేనలా అనుకోవడం లేదు. ఎందుకంటే అతను వికెట్లు తీయకపోయినా.. జట్టు విజయానికి అవసరమైన తీరులో బౌలింగ్‌ చేస్తాడు. అయితే, ఈ టోర్నీలో చక్కగా బౌలింగ్‌ చేసినా వికెట్లు ఎక్కువగా తీయలేకపోయాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో అతని లక్‌ బాగుంది. కీలకమైన మూడు వికెట్లు తీశాడు. జట్టు సెమీస్‌ చేరేందుకు రోహిత్‌కు సమానంగా బుమ్రా కృషి కూడా ఉంది’అన్నాడు. 

ఇక వరల్డ్‌కప్‌లో 8 మ్యాచ్‌లాడిన బుమ్రా 17 వికెట్లతో బౌలర్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 26 వికెట్లతో స్టార్క్‌, 20 వికెట్లతో బంగ్లా బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక 4.48 ఎకానమీతో బుమ్రా బెస్ట్‌గా ఉన్నాడు. అత్యధికంగా ఈ టోర్నీలో 8 మెయిడెన్‌ ఓవర్లు కూడా వేశాడు.

మరిన్ని వార్తలు