‘దిగ్గజ గురువు’ అస్తమయం

3 Jan, 2019 00:51 IST|Sakshi
తన భారతరత్న పురస్కారాన్ని అచ్రేకర్‌కు చూపుతున్న సచిన్‌ (ఫైల్‌) 

కన్ను మూసిన కోచ్‌ అచ్రేకర్‌ 

సచిన్, కాంబ్లీలను తీర్చిదిద్దిన శిక్షకుడు

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో పాటు అనేక మంది అంతర్జాతీయ, ఫస్ట్‌ క్లాస్‌ ఆటగాళ్లను దేశానికి అందించిన ప్రముఖ కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌ కన్ను మూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంత కాలంగా అచ్రేకర్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారని, బుధవారం సాయంత్రం ఆయన మృతి చెందారని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆటగాడిగా తన కెరీర్‌లో అచ్రేకర్‌ ఒకే ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడారు. 1964లో హైదరాబాద్‌లో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ టోర్నీలో భాగంగా హెచ్‌సీఏ ఎలెవన్‌తో జరిగిన పోరులో ఆయన ఎస్‌బీఐ తరఫున బరిలోకి దిగారు. కొంత కాలం ముంబై సెలక్టర్‌గా కూడా పని చేశారు. సచిన్‌తో పాటు ఆయన వద్ద శిక్షణ పొందిన వారిలో వినోద్‌ కాంబ్లీ, ప్రవీణ్‌ ఆమ్రే, సమీర్‌ దిఘే, బల్వీందర్‌ సింగ్‌ సంధూ, చంద్రకాంత్‌ పండిత్, అజిత్‌ అగార్కర్, రమేశ్‌ పొవార్‌ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగారు. శిక్షకుడిగా సేవలకుగాను 1990లో ‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్న అచ్రేకర్‌కు 2010లో ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కింది.  

సచిన్‌కు ఓనమాలు... 
దాదర్‌ ప్రాంతంలోని శివాజీ పార్క్‌లో అచ్రేకర్‌ క్రికెట్‌ అకాడమీ ఉండేది. ఆయన ఎంత మందికి శిక్షణనిచ్చినా ‘సచిన్‌ గురువు’గానే క్రికెట్‌ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంది. సచిన్‌ కూడా తన సుదీర్ఘ కెరీర్‌లో లెక్క లేనన్ని సార్లు తన గురువును గుర్తు చేసుకునేవాడు. ఓనమాలు నేర్పిన నాటినుంచి తన చివరి టెస్టు ఆడే వరకు ప్రతీ దశలో ఆయన పాత్ర, ప్రభావం గురించి చెప్పడం టెండూల్కర్‌ ఏనాడూ మర్చిపోలేదు. క్రికెట్‌లో ఎదగాలంటే అప్పటి వరకు చదువుతున్న న్యూ ఇంగ్లీష్‌ స్కూల్‌ నుంచి శారదాశ్రమ్‌ విద్యామందిర్‌కు మారమని అచ్రేకరే తన శిష్యుడికి సూచించారు. ప్రతి ఏటా గురుపూర్ణిమ రోజున తన గురువును కలిసి ఆశీర్వచనాలు తీసుకోవడం సచిన్‌ అలవాటుగా మార్చుకున్నాడు.

సర్‌ శిక్షణ ఇచ్చిన చాలా మంది విద్యార్థుల్లాగే నేను కూడా ఆయన దగ్గరే క్రికెట్‌లో ఏబీసీడీలు నేర్చుకున్నాను. నా జీవితంలో ఆయన పోషించిన పాత్ర గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఆయన వేసిన పునాదిపైనే నేను నిలబడ్డాను. సర్‌ వద్ద శిక్షణ తీసుకున్న మరికొందరితో కలిసి గత నెలలో ఆయనను కలిశాం. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపాం. నేరుగా ఆడటమే కాదు తప్పులు చేయకుండా నిజాయతీగా బతకడం కూడా అచ్రేకర్‌ సర్‌ నేర్పించారు. మీ కోచింగ్‌తో మమ్మల్ని మీలో ఒకడిగా చేసుకున్నందుకు కృతజ్ఞతలు. జీవితంలోనూ చాలా బాగా ఆడారు సర్‌. మీరు ఎక్కడ ఉన్నా కోచింగ్‌ ఇస్తూనే ఉంటారు. మీ వల్ల స్వర్గంలో కూడా క్రికెట్‌ వికసిల్లుతుంది.      
– సచిన్‌ టెండూల్కర్‌ నివాళి 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా