'ఆ థ్రిల్ల‌ర్ మ్యాచ్‌ను ఎప్ప‌టికి మ‌రిచిపోను'

22 Apr, 2020 16:53 IST|Sakshi

స‌చిన్ టెండూల్క‌ర్.. అప్పట్లో ఈ పేరు వింటేనే అభిమానుల‌కు  ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్స్ వ‌చ్చేవి. మ‌రి అలాంటి స‌చిన్ బ్యాటింగ్‌కు దిగాడంటే అభిమానుల‌కు పూన‌కాలు వ‌చ్చేవి. ఒక బ్యాట్స్‌మెన్‌గా త‌న పేరిట లెక్క‌లేన‌న్ని రికార్డులు లిఖించుకున్నాడు. టెస్టు, వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా, అంతేగాక రెండు  ఫార్మాట్ల‌లో క‌లిసి వంద సెంచ‌రీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డుల‌కెక్కాడు.

అయితే స‌చిన్‌లో మ‌న‌కు తెలియ‌ని మ‌రో కోణం ఉంది.. అత‌ను మంచి బౌల‌ర్ కూడా అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. స‌చిన్ త‌న లెగ్‌బ్రేక్ బౌలింగ్‌తో వ‌‌న్డేల్లో 156 వికెట్లు, టెస్టుల్లో 46 వికెట్లు తీశాడు.జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన సంద‌ర్బాల్లో బౌలింగ్ వేసి మ్యాచ్‌ల‌ను కూడా గెలిపించాడు. అయితే బ్యాట్స్‌మెన్‌గా కాకుండా ఒక బౌల‌ర్‌గా మ్యాచ్ గెలిపించిన సంద‌ర్భాల్లో ఏది ఇష్టం అని సచిన్‌ను అడిగితే.. 1993 హీరో క‌ప్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌ను థ్రిల్ల‌ర్ మ్యాచ్‌గా గుర్తుపెట్టుకుంటాన‌ని చాలా సంద‌ర్భాల్లో తెలిపాడు. (తుఫాన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించాడు‌)

తాజాగా ఐసీసీ మీ జీవితంలో ఒక మొమ‌ర‌బుల్ మూమెంట్‌ను షేర్ చేసుకోవాల‌ని స‌చిన్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌డంతో మ‌రోసారి ఆ థ్రిల్ల‌ర్ మ్యాచ్‌ను గుర్తుచేశాడు. '1993 హీరో క‌ప్‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్‌లో  ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన సెమీఫైన‌ల్లో  ముందుగా బ్యాటింగ్ చేసి 50 ఓవ‌ర్ల‌లో 196 ప‌రుగులు చేశాము. కెప్టెన్ అజారుద్దీన్ 90 ప‌రుగుల‌తో రాణించ‌డంతో జ‌ట్టుకు  ఆ మాత్రం స్కోరైనా వ‌చ్చింది. త‌ర్వాత మా బౌల‌ర్లు పొదుపుగా  బౌలింగ్ చేసి మ్యాచ్‌ను చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు తెచ్చారు. ప్రొటీస్ విజ‌యం సాధించాలంటే చివ‌రి ఓవ‌ర‌లో ఆరు ప‌రుగుల చేస్తే చాలు. క్రీజ్‌లో బ్రియాన్ మెక్‌మిల‌న్ 48 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

అప్ప‌టివ‌ర‌కు ఒక అద్భుతం జ‌ర‌గ‌నుందని నాకు కూడా తెలియ‌దు. అజారుద్దీన్ బాల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అంత ఉత్కంఠ స‌మ‌యంలో బంతి నాకెందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. నా మ‌నుసులో స‌రే అనుకొని బౌలింగ్‌కు దిగాను. మొద‌టి బాల్‌ను ఆడిన మెక్‌మిల‌న్ రెండో ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించ‌డంతో ఫానీ డివిలియ‌ర్స్ ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో విజ‌యలక్ష్యం 5 ప‌రుగులుగా మారింది. త‌ర్వాతి మూడు బంతుల‌ను డాట్ బాల్స్‌గా వేసాను. ఇక చివ‌రి బంతికి నాలుగు ప‌రుగులు కావాలి. మెక్‌మిలన్  బ‌లంగానే షాట్ బాదిన‌ప్ప‌టికి సింగిల్ ర‌న్ వ‌చ్చింది. అంతే మూడు ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికాపే విజ‌యం సాధించ‌డంతో జ‌ట్టులో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. చివ‌రి బంతి వ‌ర‌కు ఊరించిన విజ‌యం మాకు ల‌భించిద‌నే దానిక‌న్నా చివ‌రి ఓవ‌ర్ నేను వేసి జ‌ట్టును గెలిపించానా అన్న‌దే ఎక్కువ సంతోషాన్నిచ్చింది. ఈ థ్రిల్ల‌ర్ మ్యాచ్ నాకు చాలా కాలం పాటు గుర్తుందంటూ' స‌చిన్‌ చెప్పుకొచ్చాడు.
(చిన్నారి ఫుట్‌వ‌ర్క్‌కు ఫిదా అవ్వాల్సిందే )

మరిన్ని వార్తలు