అన్న గెలవాలని తమ్ముడు... తమ్ముడు నెగ్గాలని అన్న 

3 May, 2019 04:43 IST|Sakshi

సచిన్‌ సోదరుల  బంధంలోని గొప్పదనం

ఓ అరుదైన ఘటనను  తొలిసారిగా వివరించిన మాస్టర్‌  

ముంబై: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కెరీర్‌ నిర్మాణంలో అతడి అన్న అజిత్‌ టెండూల్కర్‌ పాత్ర ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తమ్ముడి ఉన్నతికి అజిత్‌ సొంత కెరీర్‌నే త్యాగం చేశాడంటారు. సచిన్‌ కూడా అవకాశం దక్కినప్పుడల్లా అన్న గురించి చాలా గొప్పగా చెబుతుంటాడు. వీరిద్దరి మధ్య అంతటి అనుబంధం ఉండేది. దీనిని మరింతగా చాటే ఓ ఉదాహరణను సచిన్‌... గురువారం అందరితో పంచుకున్నాడు. ముంబైలోని ఎంఐజీ క్రికెట్‌ క్లబ్‌లో తన పేరిట నెలకొల్పిన పెవిలియన్‌ ప్రారంభం సందర్భంగా ఈ క్లబ్‌తో ప్రత్యేక అనుబంధాన్ని చెప్పమన్నప్పుడు అతడీ విషయం చెప్పాడు. అదేంటో అతడి మాటల్లోనే... ‘ఇది గతంలో ఎప్పుడూ చెప్పని విషయం. చాలా ఏళ్ల క్రితం, అంటే నేనింకా రంజీల్లో కూడా అడుగుపెట్టని రోజులనుకుంటా.

కానీ, అప్పుడప్పుడే నా ఎదుగుదల ప్రారంభమవుతోంది. అప్పట్లో ఎంఐజీలో జరిగే సింగిల్‌ వికెట్‌ టోర్నీలో నేను, అజిత్‌ పాల్గొనేవారం. ఓసారి ఇద్దరం వేర్వేరు గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తూ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎదురుపడ్డాం. ఇలాంటి సందర్భం మాకు అదే మొదటిసారి. అయితే, నాకు బౌలింగ్‌ చేస్తున్నప్పుడు వైడ్లు, నో బాల్స్‌ వేస్తున్న అజిత్‌ బాడీ లాంగ్వేజ్‌ చూస్తే... అతడికి నన్ను ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ, ఔట్‌ చేసే ఉద్దేశం ఉన్నట్లు కనిపించలేదు. సరిగ్గా నేను కూడా అన్నయ్య ఓడిపోకూడదన్నట్లు షాట్లు కొట్టే ఆలోచన చేయలేదు. డిఫెన్స్‌ ఆడుతూ వస్తున్నాను. దీంతో, నీ సహజమైన ఆట నువ్వు ఆడు అంటూ అజిత్‌ చెప్పాడు. మన కంటే పెద్దవాడైన అన్నయ్య చెప్పిన మాట వినాలి అంటారు కదా? నేనదే చేశాను. ఆ మ్యాచ్‌లో గెలిచి మా జట్టు ఫైనల్‌కు వెళ్లింది. ఇక్కడ అజిత్‌ ఓడినా నేను గెలిచినట్లు కాదు’.  
 

మరిన్ని వార్తలు