ఇన్నింగ్స్‌ విజయంతో ఇన్నింగ్స్‌ ముగించాడు..!

16 Nov, 2019 13:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ శకం నడిచిందంటే అతిశయోక్తి కాదు. తాను క్రికెట్‌ ఆడిన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలు మరెన్నో అద్భుతాలు సచిన్‌ సొంతం. క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్ అనే స్థాయికి తన ఆటను తీసుకువెళ్ళాడు ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌. మొదటగా సచిన్ తన 16 ఏళ్ల వయసులో 1989 నవంబర్ 15 న పాకిస్తాన్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.. ఆ మ్యాచ్ లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

ఆ తర్వాత అంచెలంచలుగా ఎదిగిన సచిన్ చాలా రికార్డులను నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్ లో సచిన్ ఓ చరిత్ర సృష్టించాడు.  అతిపిన్న వయస్సులో (16) వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడుగా చరిత్రకెక్కిన సచిన్‌..  వన్డే,టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడుగా సచిన్ రికార్డులోకి ఎక్కాడు. వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సచిన్‌.. అత్యధిక సార్లు మ్యాన్ అఫ్ ది మ్యాచ్, మ్యాన్ అఫ్ ది సిరీస్ లను అందుకున్న బ్యాట్స్ మన్ గా సచిన్ రికార్డు సృష్టించాడు. మొత్తం 200 టెస్ట్ మ్యాచ్ లు , 463 వన్డే మ్యాచ్ లు ఆడాడు. సచిన్‌ గురించి ఇలా చెప్పుకుంటే పోతే చాలానే రికార్డులు ఉన్నాయి. క్రికెట్‌ రికార్డు పుస్తకాల్లో ఇది సచిన్‌ పేజీ అనేంతంగా రికార్డులు మోత మోగించాడు.

అయితే నవంబర్‌ 15 తేదీతో సచిన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ను ఆరంభించిన 30 ఏళ్లు పూర్తి కాగా,  నవంబర్‌ 16వ తేదీ సచిన్‌ తన ఇన్నింగ్స్‌ను ముగించిన రోజు. 2013, నవంబర్‌16వ తేదీన సచిన్‌ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆఖరి ఆటను ఆస్వాదించిన రోజుది. సరిగ్గా ఆరేళ్ల క్రితం వెస్టిండీస్‌తో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ సచిన్‌కు చివరిది. నవంబర్‌ 14వ తేదీన ఆరంభమైన మ్యాచ్‌ నవంబర్‌16 తేదీనే ఫలితం తేలిపోయింది.

మూడు  రోజుల్లో ముగిసిన ఆ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌  126 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చిన సచిన్‌ 74 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్‌లో కూడా తనలోని సత్తాతగ్గాలేదని నిరూపించి భారత్‌ ఇన్నింగ్స్‌ విజయంలో పాలు పంచుకున్నాడు.సచిన్‌ అంతర్జాతీయ కెరీర్‌లో 51 టెస్టు సెంచరీలు, 68 టెస్టు ఫిఫ్టీలు ఉన్నాయి. 329  టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్‌ 15, 291 పరుగులు చేసి ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వన్డే కెరీర్‌లో 463 మ్యాచ్‌లు ఆడి 49 సెంచరీలు, 96 హాఫ్‌ సెంచరీలు నమెదు చేశాడు. వన్డేల్లో సచిన్‌ 44.38 సగటుతో 18, 426 పరుగులు చేశాడు. టెస్టుల్లో 53.78 సగటు నెలకొల్పాడు సచిన్‌.

మరిన్ని వార్తలు