కుల్దీప్‌పై రూట్‌ సక్సెస్‌ కారణం అదే: సచిన్‌

22 Jul, 2018 11:08 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి వరల్డ్‌లోని చాలా మంది క్రికెటర్లు ఇబ్బంది పడుతుంటే, ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జో రూట్‌ మాత్రం అతని బౌలింగ్‌ను సమర్దవంతంగా ఆడాటానికి గల కారణాలను సచిన్‌ టెండూల్కర్‌ వెల్లడించాడు.

‘కుల్దీప్‌ బంతి వేసే విధానం సంక్లిష్టంగా ఉండటంతో బ్యాట్స్‌మెన్‌ అతడి బౌలింగ్‌ను బాగా ఎదుర్కోలేరు. నేను టెలివిజన్‌లో చూసినదాని ప్రకారం కుల్దీప్‌ బంతిని విడుదల చేసే మణికట్టు స్థానాన్ని ముందుగానే గ్రహించి జో రూట్‌ చక్కగా ఆడాడు. కుల్దీప్‌ మణికట్టు పొజిషన్‌ను త్వరగా అర్థం చేసుకున్నాడు కాబట్టే అతని బౌలింగ్‌ను సమయోచితంగా ఆడి రూట్‌ విజయం సాధించాడు’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా ఏ విధంగా ఫ్లాట్‌, పొడి పిచ్‌లపై ఆడిందో అవే తరహా పిచ్‌లే టెస్టు సిరీస్‌లో కూడా ఎదురయ్యే అవకాశం ఉందని సచిన్‌ తెలిపాడు. ఇదే కనుక జరిగితే టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నాడు. అదే సమయంలో భువనేశ్వర్‌ కుమార్‌ జట్టుకు దూరం కావడం తీరని లోటుగా సచిన్‌ పేర్కొన్నాడు. ‘భువి కొంత కాలంగా భారత్‌ తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడి నుంచి నేను చాలా ఆశిస్తున్నాను. బంతిని స్వింగ్‌ చేయగల సత్తా ఉన్న అతడు ఇంగ్లండ్‌లో కీలకం అవుతాడు. టెయిలెండర్లలో భువి మంచి బ్యాట్స్‌మన్‌ కూడా. 2014లో ఇంగ్లండ్‌లో అతడు పరుగులు చేసిన విధానమే దీనికి ఉదాహరణ’ అని సచిన్‌ స్పష్టం చేశాడు.

మూడు వన్డేల సిరీస్‌లో జో రూట్‌ రెండు వరుస సెంచరీలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో జో రూట్‌ మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా కుల్దీప్‌ బౌలింగ్‌లో ఔట్‌ కాగా, రెండు , మూడు వన్డేల్లో మాత్రం శతకాలు సాధించి అజేయంగా నిలిచాడు.

మరిన్ని వార్తలు