‘ప్రపంచకప్‌.. కోహ్లి ఒక్కనితో కాదు’

22 May, 2019 19:22 IST|Sakshi

ఇతరులు చేయి వేయాల్సిందే: సచిన్‌ 

ముంబై : భారత్‌ ప్రపంచకప్‌ గెలవాలంటే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒక్కడు ఆడితే సరిపోదని, ఇతర ఆటగాళ్లు సైతం తలో చేయి వేయాల్సిందేనని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. బుధవారం పీటీఐతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘ఒక్కడు ఆడితే టైటిల్‌ గెలవడం కష్టం. జట్టుగా రాణిస్తేనే టోర్నీని గెలవచ్చు. ముఖ్యంగా కీలక సమయాల్లో అందరు రాణించాల్సిందే. ఒక్కరిపైనే ఆధారపడితే నిరాశ తప్పదు.’ అని 1996,1999, 2003 ప్రపంచకప్‌ టోర్నీల్లో సచిన్‌లా తాజా టోర్నీలో కోహ్లి ఒక్కడే రాణిస్తే అన్న ప్రశ్నకు సచిన్‌ ఇలా సమాధానమిచ్చాడు. ఇక నాలుగోస్థానం బ్యాటింగ్‌పై ఆందోళన చెందాల్సిన పనిలేదని, అది కేవలం ఒక నెంబర్‌లానే భావించాలన్నాడు. మనకు చాలా మంది బ్యాట్స్‌మెన్‌ ఉన్నారని, పరిస్థితులకు తగ్గట్టు రాణిస్తే పెద్ద సమస్య ఉండదన్నాడు. మన ఆటగాళ్లు చాలా క్రికెట్‌ ఆడారని, నెం 4,6,8 స్థానాల్లో బ్యాటింగ్‌ చేశారన్నారు. పరిస్థితులను అర్థం చేసుకోవడమే కీలకమని సచిన్‌ చెప్పుకొచ్చాడు.

ప్రపంచకప్‌కు ఎంపికైన భారత జట్టు సమతూకంతో ఉందని, అనుభవం గల ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారని సచిన్‌ తెలిపాడు. గత కొన్నేళ్లుగా భారత్‌ అద్భుతంగా రాణిస్తుందని, మన జట్టుకు విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. కుల్దీప్‌, చహల్‌లు ఆస్ట్రేలియా సిరీస్‌ను పట్టించుకోవద్దన్నాడు. వారు అద్భుతంగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు