సచిన్‌కు ఈరోజు చాలా స్పెషల్‌!

9 Sep, 2019 14:48 IST|Sakshi
సచిన్‌ టెండూల్కర్‌ (ఫైల్‌)

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ క్రీడాజీవితంలో ఈరోజు (సెప్టెంబర్‌ 9) చాలా ప్రత్యేకం. 25 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మాస్టర్‌ బ్లాస్టర్‌ వన్డేల్లో తన మొట్టమొదటి సెంచరీ సాధించాడు. అయితే తొలి సెంచరీ సాధించడానికి ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1989లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన సచిన్‌ 1994, సెప్టెంబర్‌ 9న మొదటి సెంచరీ సాధించాడు. 78 మ్యాచ్‌లు ఆడిన తర్వాతే తొలి శతకం అతడి ఖాతాలో పడింది. కొలంబోలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మేటి బౌలర్లను ఎదుర్కొని 130 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

టెస్టుల్లో మాత్రం అరంగ్రేటం చేసిన రెండేళ్లలోనే మొదటి సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నుముకలా నిలిచిన సచిన్‌ టెండూల్కర్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించాడు. వన్డేల్లో 49 సెంచరీలతో సహా వంద అంతర్జాతీయ శతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. సచిన్‌ తొలి వన్డే సెంచరీ సాధించి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఆనాటి మధుర ఘట్టాన్ని బీసీసీఐ సోమవారం ట్వీట్‌ చేసింది. (చదవండి: ‘ఆ బ్యాటింగ్‌ టెక్నిక్‌ అతనికే సొంతం’)

>
మరిన్ని వార్తలు