సచిన్‌ గురువు అచ్రేకర్‌ ఇకలేరు 

2 Jan, 2019 19:29 IST|Sakshi

ముంబై: క్రికెట్‌ దిగ్గజం, సచిన్‌ టెండూల్కర్‌ గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌(87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ముంబైలో దాదార్‌లోని శివాజీరాజ్ పార్కులో రమాకాంత్‌ ఎందరో యువ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చేవారు. లెజండరీ క్రికెట్‌ కోచ్‌గా పేరుగాంచిన అచ్రేకర్‌ సచిన్‌ టెండూల్కర్‌, వినోద్‌ కాంబ్లీ వంటి దిగ్గజ క్రికెటర్లను తీర్చిదిద్దారు.

క్రికెట్‌ రంగంలో అసమాన సేవలందించినందుకు గాను కేంద్రప్రభుత్వం ఆయనకు 1990లో ద్రోణాచార్య అవార్డుతో, 2010లో పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.  అంతేకాకుండా ముంబైలోని జింఖాన శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా అచ్రేకర్ కు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ను అందజేశారు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ సుధీర్ఘ కాలం పాటు కొనసాగడంలో అచ్రేకర్‌ పాత్ర ఎనలేనిది. గురుపౌర్ణిమ సందర్భంగా అంద‌రూ గుడికి వెళ్లి దేవుడ్ని దర్శించుకుంటే.. సచిన్ మాత్రం తన గురువైన రమాకాంత్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటాడు. అచ్రేకర్‌ మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు