ఐసీసీ తీరును తప్పుబట్టిన అజ్మల్ పై చర్యలు!

5 Nov, 2015 17:11 IST|Sakshi
ఐసీసీ తీరును తప్పుబట్టిన అజ్మల్ పై చర్యలు!

కరాచీ:  ప్రపంచ క్రికెట్ లోని సందేహాస్పద బౌలింగ్ పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వ్యవహరించే తీరు ఏకపక్షంగా  ఉంటుందంటూ విమర్శలకు దిగిన పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్(38) పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది.  బుధవారం జియో చానల్ నిర్వహించిన టాక్ షోలో అజ్మల్ మాట్లాడుతూ.. ఐసీసీ తీసుకునే చర్యలు కేవలం ఆఫ్ స్పిన్నర్లేపైనే ఉంటాయా? అంటూ ప్రశ్నించి తాజా వివాదానికి తెరలేపాడు. చాలా మంది బౌలర్లు తమ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నప్పటికీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అజ్మల్ ప్రశ్నించాడు.

 

'ఆఫ్ స్పిన్నర్లే లక్ష్యంగా ఐసీసీ వ్యవహరిస్తోంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లపై చర్యలు ఎందుకు తీసుకోరు. అందులో లెగ్ స్పిన్నర్లకు ఫాస్ట్ బౌలర్లకు మినహాయింపు ఎందుకు ఇస్తున్నారు.  ఈ విషయాన్ని ఎప్పట్నుంచో గమనిస్తునే ఉన్నాను. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న చాలా మంది పేర్లు నాకు తెలుసు. కానీ వారి పేర్లు చెప్పాలని అనుకోవడం లేదు' అని అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలా బహిరంగంగా విమర్శలు గుప్పించిన అజ్మల్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీరియస్ గా ఉంది.  దీనిలో భాగంగా అతనిపై చర్యలు తీసుకోవాలని పాక్ క్రికెట్ పెద్దలు భావిస్తున్నారు. అసలు అజ్మల్ మాట్లాడిన టేపును నిపుణులతో పర్యవేక్షించిన తరువాత అతనిపై చర్యలు తీసుకోవాలని బోర్డు యోచనగా ఉంది.  కాగా, దీనిపై 48 గంట్లలో వివరణ ఇవ్వాలని కోరుతూ అజ్మల్ కు పాక్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  సందేహాస్పాద బౌలింగ్ యాక్షన్ తో గత సంవత్సరం నుంచి అజ్మల్ పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు