‘గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ కీపర్‌ కాలేరు’

27 Aug, 2019 18:39 IST|Sakshi

న్యూఢిల్లీ:  వెస్టిండీస్‌ పర్యటనలో వరుసగా విఫలమవుతున్న భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఒకే తరహా షాట్లు ఆడి వికెట్‌ను సమర్పించుకుంటున్న పంత్‌ను ఇప్పటికే పలువురు విమర్శించగా, తాజాగా భారత మాజీ వికెట్‌ కీపర్‌ సయ్యద్‌ కిర్మాణీ కూడా పంత్‌ను సుతిమెత్తగా మందలించాడు. గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరంటూ పరోక్షంగా చమత్కరించాడు. అదే సమయంలో వృద్ధిమాన్‌ సాహాను వెనుకేసుకొచ్చాడు కిర్మాణీ. ఇటీవల కాలంలో పంత్‌కు పదే పదే అవకాశాలిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్‌.. సాహాను అస్సలు పట్టించుకోకపోవడం నిరాశ కల్గిస్తుందన్నాడు.

ఒకవైపు పంత్‌ను పరీక్షిస్తూనే మరొకవైపు సాహాకు కూడా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. పంత్‌తో సమానమైన అవకాశాలను సాహాకు కూడా ఇవ్వాలన్నాడు. ‘ పంత్‌ టాలెంట్‌ ఉన్న క్రికెటరే. కానీ అతను ఇంకా చాలా నేర్చుకోవాలి. అతనికి నేర్చుకుంటూ ఎదగడానికి సమయం చాలా ఉంది. అటువంటి సందర్భంలో సాహాను నిర్లక్ష్యం చేయడం తగదు.  విండీస్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో సాహాకు అవకాశం ఇవ్వకపోవడం నిరాశకు గురి చేసింది. సాహా మంచి వికెట్‌ కీపరే కాదు.. బ్యాట్స్‌మన్‌ కూడా. ఆ విషయాన్ని మరిచిపోకండి. ఒక జత కీపింగ్‌ గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరు కదా’ అంటూ కిర్మాణీ చురకలంటించాడు. కనీసం రెండో టెస్టులోనైనా సాహాకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు.

దాదాపు ఏడాది పాటు గాయం కారణంగా జట్టుకు దూరమైన సాహా.. ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.  ఈ క‍్రమంలోనే తొలి టెస్టులోనే సాహాకు అవకాశం దక్కుతుందని ఆశించారు. కాకపోతే విండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో విఫలమైన పంత్‌నే తొలి టెస్టులో ఆడించడం విమర్శలకు దారి తీసింది. ఇక్కడ కూడా పంత్‌ నిరాశ పరచడం విమర్శకుల నోటికి మరింత పని చెప్పింది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా