‘గత 10 ఏళ్లలో సాహానే బెస్ట్‌ కీపర్‌’

12 Nov, 2018 13:35 IST|Sakshi

న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా టీమిండియాలో ప్రస్తుతం చోటు దక్కని క్రికెటర్ వృద్ధిమాన్ సాహా భారత అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ అని మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గత 10 ఏళ్లలో భారత క్రికెట్‌ జట్టులోకి వచ్చిన వికెట్‌ కీపర్ల పరంగా చూస్తే సాహానే బెస్ట్‌ అంటూ గంగూలీ కితాబిచ్చాడు. ఎంఎస్‌ ధోని టెస్టులకు గుడ్‌ బై చెప్పిన తర్వాత సాహా టెస్టు ఫార్మాట్‌లో రెగ్యులర్‌ కీపర్‌గా మారిపోయాడు. ధోని స్థాయిలో కీపింగ్‌ చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం భుజం నొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న సాహా విశ్రాంతి తీసుకుంటున్నాడు.

‘దాదాపు ఏడాదిగా సాహా జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ గత పదేళ్లలో భారత జట్టులో ఆడిన వికెట్‌ కీపర్ల పరంగా చూస్తే అతనే అత్యుత్తమం. గాయాలనేవి ఆటగాడి చేతిలో ఉండవు. వికెట్‌ కీపర్‌ అన్నాక దూకాల్సిందే. అలా దూకేటపుడే సాహా గాయపడ్డాడు. కోలుకోవడానికి సమయం పడుతుంది. అతను త్వరగా మామూలు స్థితికి చేరుకుని పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్నా' అని గంగూలీ అన్నాడు.

>
మరిన్ని వార్తలు