ఇప్పుడు కోచ్‌లకు ‘పరీక్షా’కాలం

18 Jul, 2017 02:07 IST|Sakshi

ఫిట్‌నెస్‌ లేని ‘సాయ్‌’ కోచ్‌లకు ఉద్వాసనే!  
న్యూఢిల్లీ: ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ టెస్టులనేవి సహజం. కానీ ఇప్పుడు కోచ్‌లు కూడా తమ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి వస్తోంది. లేదంటే తప్పుకోవాలి... తప్పదు! కేంద్ర క్రీడాశాఖ, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కోచ్‌లకు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. 40 ఏళ్లు పైబడిన కోచ్‌లు తమ సత్తా చాటుకుంటేనే కొనసాగించాలని, లేదంటే ఉద్వాసన పలకాలని క్రీడాశాఖ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది కోచ్‌లు ఈ టెస్టుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. వీరికి 800 మీటర్ల పరుగుతో పాటు పలు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆరోగ్య సామర్థ్య పరీక్షలు చేస్తారు.

అంటే వారు కోచింగ్‌కు అర్హులేనా అనే విషయాన్ని తేలుస్తారు. ఆయా రంగాల్లో నిష్ణాతులు, అనుభవజ్ఞులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో త్వరలో నార్త్‌జోన్‌ నుంచి ఈ టెస్టుల ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబర్‌ చివరి కల్లా దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. ఈ కమిటీకి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీవీపీ రావు చైర్మన్‌గా వ్యవహరిస్తారని క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు