సెమీస్‌తో సరి

28 Jul, 2019 05:15 IST|Sakshi

ప్రపంచ చాంపియన్‌ కెంటో మొమోటా చేతిలో ఓడిన సాయిప్రణీత్‌

జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన భారత్‌ పోరు  

టోక్యో: ఊహించిన ఫలితమే వచ్చింది. సెమీఫైనల్‌ చేరే క్రమంలో తనకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న ఆటగాళ్లను ఓడించిన హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌... సెమీఫైనల్లో మాత్రం తన శక్తిమేర పోరాడినా సంచలన ఫలితం నమోదు చేయలేకపోయాడు. ఫలితంగా జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో భారత కథ ముగిసింది.

శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 18–21, 12–21తో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో 11వ ర్యాంకర్‌ నిషిమోటో (జపాన్‌)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 17వ ర్యాంకర్‌ సునెయామ (జపాన్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 18వ ర్యాంకర్‌ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందిన సాయిప్రణీత్‌కు సెమీస్‌లో ఓటమితో 10,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 23 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

కెంటో మొమోటాతో ఐదోసారి తలపడిన సాయిప్రణీత్‌ ఈసారి వరుస గేముల్లో ఓడిపోయాడు. ఏప్రిల్‌లో సింగపూర్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో కెంటో మొమోటాకు మూడు గేమ్‌లపాటు ముచ్చెమటలు పట్టించిన ఈ తెలుగు తేజం ప్రస్తుత పోరులో 45 నిమిషాల్లో ఓటమి చవిచూశాడు. తొలి గేమ్‌ హోరాహోరీగా సాగినా కీలకదశలో మొమోటా పైచేయి సాధించాడు. ఒకదశలో 6–11తో వెనుకబడిన సాయిప్రణీత్‌ అద్భుత ఆటతో వరుసగా ఐదు పాయింట్లు గెలిచి స్కోరును 11–11తో సమం చేశాడు. కానీ వెంటనే తేరుకున్న మొమోటా వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లాడు.

ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌ ఆరంభంలో సాయిప్రణీత్‌ దూకుడుగా ఆడుతూ 9–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ నిలబెట్టుకోలేకపోయాడు. మొమోటా సాధికారిక ఆటతీరుకుతోడు అనవసర తప్పిదాలు చేసిన సాయిప్రణీత్‌ వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయాడు. 9–12తో వెనుకంజలో నిలిచాడు. ఆ తర్వాత సాయిప్రణీత్‌ కోలుకొని 12–14తో ఆధిక్యాన్ని రెండు పాయింట్లకు తగ్గించాడు. ఈ దశలో మొమోటా ఒక్కసారిగా గేర్‌ మార్చాడు. వరుసగా ఏడు పాయింట్లు సంపాదించి 21–12తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.   

‘మ్యాచ్‌లో అడపాదడపా బాగా ఆడాను. కెంటో మొమోటాను ఓడించడం అంత సులువు కాదు. ఏ రకంగా ఆడినా అతని నుంచి సమాధానం వస్తోంది. దూకుడుగా ఆడినా... సుదీర్ఘ ర్యాలీలు ఆడినా... రక్షణాత్మకంగా ఆడినా... స్మాష్‌ షాట్‌లు సంధించినా... మొమోటా దీటుగా బదులు ఇస్తున్నాడు. తనదైన శైలి ఆటతో ప్రత్యర్థి ఎలా ఆడాలో, ప్రత్యర్థిని ఎలా ఆడించాలో అతనే శాసిస్తున్నాడు’
 –సాయిప్రణీత్‌

>
మరిన్ని వార్తలు